Vinesh Phogat CAS Verdict : పారిస్ ఒలింపిక్స్‌లో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేసిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కేసు మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ కేసు తాజాగా ఆగస్టు 16కు పోస్ట్‌పోన్ అయ్యింది. అయితే ఈ తీర్పు భారత్‌కు అనుకూలంగా వస్తే మాత్రం వినేశ్‌కు పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు రజత పతకం ఇవ్వాల్సి ఉంటుంది.
మరోవైపు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో వినేశ్ ఇంకా స్వదేశానికి బయలుదేరలేదు. త్వరలో ఆమె భారత్‌కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం తన లగేజీని తీసుకొని ఒలింపిక్ క్రీడాగ్రామం నుంచి వినేశ్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.
'మెడల్ రాకపోయినా ఆమె ఛాంపియనే'
ఇక ఈ కేసులో వినేశ్ తరఫున వాదించిన ఇద్దరు సీనియర్ లాయర్లలో ఒకరైన విదుష్పత్ సింఘానియా తాజాగా ఈ మీడియాతో మాట్లాడారు. "ఇది మాకు చాలా కష్టమైన పని. ఎందుకంటే మా అభిప్రాయాలను సిద్ధం చేయడానికి, వాటిని కాస్ ముందుంచడానికి మాకు చాలా తక్కువ సమయమే ఉంది. కానీ, మేము కష్టపడి పనిచేసి వినేశ్ కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. సాధారణంగా కాస్ 24 గంటల్లో తీర్పు ఇస్తుంది. అయితే ఈసారి వారు తీర్పు గడువును ఒకటి కంటే ఎక్కువసార్లు పొడిగించారు. అయితే నిర్ణయం మాత్రం భారత్‌కు అనుకూలంగా వస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. ఇక తీర్పు ఇచ్చే ADHOC ప్యానెల్ 24 గంటల టైమ్ లిమిట్‌ను కలిగి ఉంది. దీన్నిబట్టి ఈ అంశం గురించి ప్యానెల్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు మాకు బాగా అర్థమవుతోంది. జడ్జీ మహిళ అయితే మాకు ఇంకా మంచిది. గతంలో నేను ఎన్నో కేసులు వాదించాను. కానీ ఈ విషయంలో సక్సెస్ రేటు చాలా తక్కువ. అందుకే వినేశ్ విషయంలో చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని జడ్జీని కోరుతున్నాం. ఇది కొంచెం కష్టమే అయినప్పటికీ ఏదైనా సరే అద్భుతం జరగాలని కోరుకుంటున్నాను. వినేశ్‌కు సిల్వర్ మెడల్ దక్కాలని అందరూ ప్రార్థించండి. ఒకవేళ మెడల్ రాకపోయినా కూడా ఆమె ఛాంపియనే" అంటూ న్యాయవాది విదుష్పత్ సింఘానియా పేర్కొన్నారు.
వినేశ్ అనర్హత, జకోవిచ్ గోల్డెన్ స్లామ్- పారిస్ ఒలింపిక్స్ హైలైట్స్ ఇవే - Paris Olympics 2024