Varanasi stadium Construction : ఉత్తర్ ప్రదేశ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం 2026 టీ20 వరల్డ్‌కప్ వరకు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. 2026 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు శ్రీలంకతో సంయుక్తంగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఆ టోర్నీలో మెజార్టీ మ్యాచ్‌లు సహా ఫైనల్ కూడా భారత్‌లోనే జరిగే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వారణాసి స్టేడియం కనీసం ఓ మ్యాచ్కైన ఆతిథ్యమిచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. '2026 టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమయ్యే లోపు వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తాం' అని బీసీసీఐ బోర్డు మెంబర్ ఒకరు జాతీయ మీడియాతో చెప్పారు. కాగా, ఈ స్టేడియాన్ని అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. కాన్పూర్ గ్రీన్ ఫీల్డ్, లఖ్‌నవూ ఎకాన మైదానం తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో ఇది మూడో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కానుంది.
మోదీ చేతులమీదుగా
2023 సెప్టెంబర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియాన్ని కాశీ విశ్వనాథుడు మహాదేవ్కు మోదీ అంకితం చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు.
స్టేడియం విశేషాలు
- ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారు.
- త్రిశూలాన్ని పోలిన ప్లడ్‌లైట్లు, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్ స్టాండ్ నిర్మిస్తున్నారు.
- గంగా ఘాట్ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనుంది.
- స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం ఆకును పోలిన మెటాలిక్ షీట్‌లను ఏర్పాటు చేయనున్నారు.
- పైకప్పు అర్ధ చంద్రాకారాన్ని ప్రతిబింబించనుంది.
- సుమారు 30,000 సీటింగ్ సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు.
- ఈ స్టేడియం నిర్మాణానికి అవసరమైన 121 ఎకరాల భూసేకరణ కోసం యూపీ ప్రభుత్వం రూ.121 కోట్లు ఖర్చు చేసింది.
- స్టేడియం నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చు కానుంది.