Tim Southee Captaincy : న్యూజిలాండ్ సీనియర్ ప్లేయర్ టిమ్ సౌథీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. 2022లో కేన్ విలియమ్సన్ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న సౌథీ కివీస్‌కు 14 టెస్టుల్లో సారథిగా వ్యవహరించాడు. అందులో ఆరు మ్యాచుల్లో జట్టను గెలిపించాడు. తాజాగా శ్రీలంకపై టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శనతో అతడి కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ క్రమంలోనే సౌథీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కివీస్ జట్టును నడిపించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
'బ్లాక్‌క్యాప్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం అద్భుత గౌరవం. ఈ అవకాశం కల్పించిన మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు. జట్టు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశా. వ్యక్తిగతం కంటే జట్టునే తొలి ప్రాధాన్యంగా భావించా. ఇక నుంచి నా ప్రదర్శనపై దృష్టిసారించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తా. సహచరులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. యువ బౌలర్లను ప్రోత్సహిస్తూనే ఉంటా. అంతర్జాతీయ స్థాయిలో వాళ్లు మెరుగ్గా రాణించాలి. టామ్ లేథమ్‌కు ఆల్ ది బెస్ట్. కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని కోరుకుంటున్నా' అని సౌథీ పేర్కొన్నాడు.
కొత్త కెప్టెన్
కాగా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు టామ్ లేథమ్‌ను తమ జట్టు కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి భారత్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు లేథమ్ నాయకత్వం వహిస్తాడని కివీస్ బోర్డు తెలిపింది. అయితే టామ్ లేథమ్‌కు కెప్టెన్సీ అవకాశం రావడం ఇది రెండోసారి. అతడు ఇదివరకు 2022- 2024 వరకు నాయకత్వం వహించాడు.
'ఇష్టంగా జట్టును నడిపించే బాధ్యతలను వదులుకోవడం తేలికైన విషయం కాదు. సౌథీ జట్టు మనిషిగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించే క్రికెటర్. ఎప్పటికీ మా అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో టిమ్ సౌథీ నిలిచిపోతాడు' అని కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపారు.
న్యూజిలాండ్ - భారత్ టెస్టు సిరీస్ షెడ్యూల్
తొలి టెస్టు | ఆక్టోబర్ 16-20 | బెంగళూరు |
రెండో టెస్టు | అక్టోబర్ 24-28 | పుణె |
మూడో టెస్టు | నవంబర్ 01-05 | ముంబయి |
సౌథీ వరల్డ్ రికార్డ్- పొట్టికప్ హిస్టరీలోనే బెస్ట్ బౌలింగ్ స్పెల్! - T20 World Cup 2024
Injured Players Before World Cup : ప్రపంచకప్ వేళ.. గాయాల గోల.. మెగాటోర్నీకి ఆ స్టార్ బౌలర్ దూరం!