Cricket In Olympics Rahul Dravid : టీమిండియా మాజీ కోచ్, భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. విశ్వ క్రీడల్లో క్రికెట్‌లో బంగారు పతకం గెలవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారని అన్నాడు. ఒలింపిక్ పోడియంపై నిలబడాలని, ఇటువంటి క్రీడా కార్యక్రమంలో భాగం కావాలని, ఎంతోమంది ఆటగాళ్ళ కల అని పేర్కొన్నాడు.
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాడాన్ని స్వాగతించిన రాహుల్ ద్రవిడ్, క్రికెట్‌లో ప్రపంచకప్‌నకు ఎంత ప్రాముఖ్యత ఉందో భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందని తెలిపాడు. 2026 టీ20 ప్రపంచ కప్, 2027లో వన్డే వరల్డ్ కప్, 2028లో ఒలింపిక్స్ ఉందని ఇప్పటికే ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నాడు. ఇప్పటికే ఒలింపిక్స్‌లో క్రికెట్ గురించి తాను డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నానని, ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌లో పాల్గొనేందుకు వారు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని మిస్టర్ డిపెండబుల్ తెలిపాడు.
పారిస్‌లో ద్రవిడ్ - ఫ్రాన్స్‌లో ఇటీవలే ఇండియా హౌస్‌ను రిలయన్స్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ఇండియా హౌస్‌లో - 2028 లాస్ ఏంజెల్స్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చిన సందర్భంగా 'క్రికెట్ ఎట్ ది ఒలింపిక్స్: డాన్ ఆఫ్ ఎ న్యూ ఎరా' అనే అంశంపై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు ద్రవిడ్ పారిస్ చేరుకున్నాడు. ఈ ఈవెంట్‌కు వచ్చేముందు తాను డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్ల కామెంట్స్‌ను తన వెంట తీసుకొచ్చానని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఒలింపిక్స్‌కు క్రికెట్ దగ్గరవుతున్న కొద్దీ, ఆటగాళ్లు విశ్వ క్రీడల్లో పాల్గొనడాన్ని సీరియస్‌గా తీసుకుంటారని వెల్లడించాడు. ఒలింపిక్స్‌ను క్రీడా ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుందని, అథ్లెట్ల ప్రదర్శనతో పాటు క్రికెటర్ల ప్రదర్శనలు కూడా అభిమానులను ఉర్రూతలూగిస్తాయని ద్రవిడ్ అన్నాడు. ఆటగాళ్లు ఇలాంటి గొప్ప ఈవెంట్‌లలో భాగం కావాలని కోరుకుంటారని ద్రవిడ్ వెల్లడించాడు.
గోల్డ్ వస్తే సంతోషమే - లాస్‌ఎంజెల్స్ ఒలింపిక్స్‌లో భారత్ పురుషుల, మహిళల జట్లు బంగారు పతకాలను గెలుచుకోవాలని ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2028 ఒలింపిక్స్‌లో భారత జట్లు గోల్డ్ మెడల్ గెలిస్తే అద్భుతంగా ఉంటుందని ద్రవిడ్ అన్నాడు. ఒలింపిక్స్‌లో దురదృష్టవశాత్తూ తాను ఆడలేదని, అయితే ఏదో ఒక హోదాలో వచ్చే ఒలింపిక్స్ నాటికి జట్టుతో ఉండేలా చూసుకుంటానని తెలిపాడు. కామంటేటర్‌గా అయినా జట్టుతో ఉంటానని వెల్లడించాడు. లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల క్రికెట్ పోటీలు ఏకకాలంలో నిర్వహిస్తారని, లాస్ ఏంజెల్స్‌లో క్రికెట్ స్టార్ అట్రాక్షన్‌లలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నట్లు ద్రవిడ్ తెలిపాడు. మహిళల క్రికెట్ వృద్ధిపై ద్రవిడ్ హర్షం వ్యక్తం చేశాడు. మహిళల క్రికెట్ బాగా పురోగమిస్తోందని అన్నాడు. మహిళా క్రికెట్ ఇప్పటికే ముందుకు సాగుతోందని.. ఇంకేమీ అవసరం లేదన్నాడు.
భారత్ ఖాతాలోకి మరో రెండు పతకాలు వచ్చే ఛాన్స్ - నేటి షెడ్యుల్ ఇదే - Paris Olympics 2024