T20 WORLDCUP 2024 Super 8 Chances : యూఎస్‌ఏ జట్టుపై టీమ్‌ఇండియా విజయం సాధించడంతో పాకిస్థాన్ టీమ్ ఊపిరి పీల్చుకుంది. అయితే ఇప్పుడు అమెరికా, పాక్ జట్ల భవితవ్యం ఐర్లాండ్ చేతిలో ఉంది. ఎలా అంటే? గ్రూప్ - Aలో ఐదు టీమ్‌లు పోటీపడుతున్నాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ - 8కు అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో భారత జట్టు మరొ మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 8కు దూసుకెళ్లింది. అంటే ఈ గ్రూప్ నుంచి ఇంకా మరో జట్టుకు మాత్రమే అవకాశం ఉంది. మరి ఆ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే మిగిలిన నాలుగు జట్లకు తదుపరి దశకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి.
యూఎస్‌ఏ టీమ్ : వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచింది. కానీ టీమ్ఇండియాపై ఓటమి అందుకోవడం వల్ల ప్రస్తుతం 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో (జూన్ 14న) పోటీపడాలి. ఇందులో గెలిస్తే ఇతర జట్ల రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా సూపర్ - 8కు వెళ్లిపోతుంది. ఒకవేళ ఓడిపోయిన కూడా కాస్త ఛాన్స్ ఉంటుంది. పాకిస్థాన్ తన చివరి మ్యాచ్‌లో ఓటమిని అందుకోవాలి.
పాకిస్థాన్ జట్టు : యూఎస్‌ఏ, టీమ్‌ఇండియా చేతిలో ఓటమిని అందుకున్న పాకిస్థాన్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. అయితే తన చివరి మ్యాచ్‌లో భారీ గెలుపును అందుకుని నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటేనే సూపర్ - 8కు వెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే యూఎస్‌ఏ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలి. అలానే ఐర్లాండ్‌తోనే పాక్ (జూన్ 16న) కూడా తన చివరి మ్యాచ్‌లో తలపడనుంది. కాబట్టి పాక్ భవితవ్యంపై స్పష్టత రావాలంటే ఇర్లాండ్ మ్యాచ్ వరకు ఆగాల్సిందే. ఒకవేళ జూన్ 14న జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా లేదా యూఎస్‌ఏ గెలిచినా పాక్ ఇంటిముఖం పట్టినట్లే! అనంతరం తన చివరి మ్యాచ్‌లో విజయం సాధించినా ఓడిపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు.
కెనడా టీమ్ : ఈ టీమ్‌కు టెక్నికల్‌గా ఛాన్స్ ఉంది. తన చివరి మ్యాచ్‌లో టీమ్ఇండియాతో తలపడనుంది. ఇందులో భారీ విజయం అందుకుని -0.493 నెట్‌రన్‌రేట్‌ను +0.127కైనా తీసుకెళ్లాలి. కానీ ఇది జరగడం కష్టమే. పైగా మ్యాచ్‌కు వర్షం ముప్పు కూడా ఉంది.
ఐర్లాండ్ జట్టు : ఐర్లాండ్ చేతిలో రెండు జట్ల సూపర్ - 8 అవకాశాలు ఉన్నాయి. యూఎస్‌ఏతో జూన్ 14, పాకిస్థాన్‌తో జూన్ 16న ఐర్లాండ్ పోటీపడనుంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో పరాజయాన్ని అందుకున్న ఐర్లాండ్ ఇప్పుడు జరగబోయే రెండు మ్యాచుల్లో గెలిచినా సూపర్ 8కు వెళ్తుందే భరోసా లేదు. ఆ జట్టు నెట్‌రన్‌రేట్ (-1.712) చాలా తక్కువగా ఉంది. ఒకవేళ ముందుకు వెళ్లాలంటే భారీ విజయాలను నమోదు చేస్తేనే కాస్త ఛాన్స్ ఉంటుందేమో.
న్యూజిలాండ్ ఖేల్ ఖతం! - సూపర్ 8కు దూసుకెళ్లిన వెస్టిండీస్ - T20 Worldcup 2024
అలా చేసినందుకు యూఎస్‌పై జరిమానా - 5 పరుగుల పెనాల్టీ ఏంటంటే? - T20 World Cup 2024