South Africa T20 World Cup Semi Final: 2024 టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రితా జట్టు వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతోంది. గ్రూప్ స్టేజ్‌లో అదరగొట్టిన సఫారీ జట్టు సూపర్- 8లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సఫారీలు సూపర్ విక్టరీ కొట్టారు. ఓ దశలో చేజారిపోయిన మ్యాచ్‌ను, పట్టువదలకుండా పోరాడి విజయం అందుకున్నారు. దీంతో సూపర్- 8లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో గ్రూప్ 2లో టాప్ పొజిషన్‌కు చేరింది. ఇక సఫారీ జట్టుకు సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే అని అంతా భావించారు. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. ఇప్పటికీ సఫారీలకు సెమీస్ బెర్తు కాస్త సందేహంగానే ఉంది. అదెలాగంటే?
ప్రస్తుత టోర్నీలో ఆడిన 6 మ్యాచ్‌లకు ఆరింట్లోనూ విజయాలు నమోదు చేసిన సఫారీలకు సెమీస్ బెర్త్ అంత ఈజీగా కనిపించడం లేదు. తాజాగా ఇంగ్లాండ్‌పై నెగ్గిన సౌతాఫ్రికా దాదాపు సెమీస్ బెర్తు కన్ఫార్మ్ చేసుకుంది. కానీ, కొన్ని గంటల్లోనే సమీకణాలు మారాయి. శనివారం ఉదయం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ విజయం నమోదు చేసింది. ఫలితంగా విండీస్ రన్‌రేట్ మెరుగైంది. దీంతో సూపర్- 8 గ్రూప్-2లో 4 పాయింట్లతో సౌతాఫ్రికా (+0.62) టాప్‌లో ఉండగా విండీస్ (+1.81), ఇంగ్లాండ్ (+0.41) రెండూ కూడా 2 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దీంతో గ్రూప్-2లో ఈ మూడు జట్ల మధ్య సెమీస్ రేస్ ఆసక్తికరంగా మారింది.
అయితే సూపర్- 8లో ఈ మూడు జట్లు తలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా తన తదుపరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది. ఆతిథ్య విండీస్ జట్టు ఈ మ్యాచ్‌ను అంత తేలిగ్గా తీసుకునే ఛాన్స్ లేదు. ఇరుజట్ల మధ్య గట్టిపోటీ ఉండనుంది. సెమీస్ చేరాలంటే విండీస్‌కు ఈ మ్యాచ్‌లో నెగ్గడం చాలా ముఖ్యం. ఒకవేళ వెస్టిండీస్ నెగ్గితే 4 పాయింట్లతోపాటు ఎక్కువ రన్రైట్ ఉన్నందున పట్టికలో సౌతాఫ్రికా కంటే మెరుగైన ప్లేస్‌కు చేరుకుంటుంది.
ఇక ఇంగ్లాండ్ తన తదుపరి మ్యాచ్ అమెరికాతో ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్‌కు ఇది చావోరేవో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ తేడాతో విజయం సాధిస్తే సౌతాఫ్రికా కంటే మెరుగైన రన్‌రేట్ వస్తుంది. ఈ లెక్కన సౌతాఫ్రికాపై విండీస్, అమెరికాపై ఇంగ్లాండ్ నెగ్గితే సఫారీ జట్టు మూడో స్థానానికి పడిపోతుంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఇలా జరగడం అసాధ్యమేమీ కాదు. అందుకే ఈ సమీకరణాలతో సౌతాఫ్రికా సెమీస్ బెర్తు ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్నట్లు కనిపిస్తోంది.
అదొక్కటే దారి!
అయితే ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా సౌతాఫ్రికా సెమీస్ చేరాలంటే వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాల్సిందే. ఈ మ్యాచ్‌లో నెగ్గితే సమీకరణాలతో ఎలాంటి పనిలేకుండా సఫారీ జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరుతుంది. మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఎంత భారీ తేడాతో గెలిచిన సఫారీ సెమీస్ బెర్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదు. వాస్తవానికి సెమీస్ చేరేందుకు గ్రూప్- 2లో సఫారీ జట్టుకే కాస్త అవకాశాలు ఎక్కువగా ఉన్నా, ఏం జరుగుతుందో అనేది చూడాలి.
దక్షిణాఫ్రికా రెండో విజయం - ఇంగ్లాండ్ ఓటమి - T20 World Cup 2024
డక్‌వర్త్ పద్ధతిలో ఆసీస్ విజయం - కమిన్స్ 'హ్యాట్రిక్' ఘనత - AUSTRALIA T20 WORLD CUP 2024