Shikhar Dhawan LLC Entry : టీమ్‌ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలో ఓ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. తాను ఇంకా ఫిట్‌గానే ఉన్నాడని, ఆటను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)లో ఎంట్రీ ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
'రిటైర్మెంట్ తర్వాత కూడా నేను ఆటగాడిగా ముందుకు సాగేందుకు దొరికిన గొప్ప అవకాశం. క్రికెట్ నా జీవితంలో ఓ భాగం. నేను నా స్నేహితులతో కలిసి మళ్లీ మైదానంలో అడుగుపెడతా. నా అభిమానులను అలరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. వారితో కలిసి జ్ఞాపకాలను సృష్టిస్తా' అని శిఖర్ దావన్ తెలిపాడు. ఈ విషయంపై ఎల్ఎల్సీ సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా స్పందించాడు. 'శిఖర్ ధావన్‌ను ఆహ్వానిస్తే మాతో చేరడం మాకు చాలా ఆనందంగా ఉంది. అతడి అనుభవం, నైపుణ్యం నిస్సందేహంగా పోటీని పెంచుతాయి. అభిమానులను అలరిస్తాయి. అతడు దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం చూసేందుకు ఎదురు చూస్తున్నాం' అని పేర్కొన్నాడు.
రిటైర్మెంట్‌పై ఎమోషనల్ వీడియో
ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియో క్యాప్షన్‌లో 'నేను నా క్రికెట్ జర్నీని ముగిస్తున్నాను. నేను నాతో లెక్కలేనన్ని జ్ఞాపకాలు, కృతజ్ఞత తీసుకెళ్తాను. మీ లవ్, సపోర్ట్‌కి ధన్యవాదాలు! జై హింద్!' అని రాసుకొచ్చాడు. 'నేను నా జీవితంలో ఓ దశలో ఉన్నాను, వెనక్కి తిరిగి చూసుకుంటే, జ్ఞాపకాలు కనిపిస్తాయి. ముందుకు చూసినప్పుడు, కొత్త జీవితం కనిపిస్తోంది. భారతదేశం కోసం ఆడాలనేది నా కల, ఆ కలను నిజం చేసుకోవడం నా అదృష్టం. నేను ఈ ప్రయాణం ద్వారా కొత్త కుటుంబాన్ని, కీర్తిని, ప్రేమను సంపాదించుకున్నా. మొదట నా కుటుంబం, నా చిన్ననాటి కోచ్‌లు, నా సహచరులకు కృతజ్ఞతలు. ముందుకు వెళ్లాలంటే, మీరు పేజీని తిప్పాల్సిందే' అని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
'నేను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. నా క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నప్పుడు, నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను నా దేశం కోసం చాలా ఆడాను, ఇప్పుడు భారత్‌కు మళ్లీ ఆడే అవకాశం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పటివరకు ఆడే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది' అని ధావన్ ముగించాడు.
ధావన్ క్రికెట్ కెరీర్
ధావన్ అన్ని ఫార్మాట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 167 మ్యాచుల్లో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు బాదాడు. 44.1 యావరేజ్‌తో మొత్తం 6,793 పరుగులు చేశాడు. టెస్టుల్లో 34 మ్యాచుల్లో 40.6 యావరేజ్‌తో 2,315 పరుగులు చేశాడు. టెస్ట్ కెరీర్‌లో ఏడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో 68 మ్యాచుల్లో 11 హాఫ్ సెంచరీలు చేశాడు. 27.9 యావరేజ్‌తో 1,759 పరుగులు చేశాడు.
దేశవాళీ క్రికెట్‌లో ధావన్ 122 ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. 25 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 44.26 యావరేజ్‌తో మొత్తం 8,499 పరుగులు చేశాడు. లిస్ట్ Aలో 302 మ్యాచ్‌లు ఆడాడు, 43.90 యావరేజ్‌తో 12,074 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
క్రికెట్‌కు శిఖర్ ధావన్ గుడ్‌బై- రిటైర్మెంట్ ప్రకటించిన 'గబ్బర్' - Shikhar Dhawan Retirement