Sam Curran IPL Price : ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను 2024 మినీ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతడ్ని అంత భారీ ధరకు సొంతం చేసుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వెల్లడించారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేసిన ఓ వీడియోలో ఆయన ఈ విషయంపై మాట్లాడాడు. 2023 ఐపీఎల్‌లో సామ్ కరన్ ఆడిన 14 మ్యాచుల్లో 27.60 సగటుతో 276 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ 135.96. బౌలింగ్‌లోనూ 10 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో ఎక్కువ ఎకానమీ (10.22) అతడిదే.
"పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఒక్క ప్లేయర్‌పై రూ. 18.50 కోట్లు వెచ్చించిన విషయాన్ని విని నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అతడు మామూలు ఆటగాడు అని నేను అనడం లేదు. కానీ, అధిక ధర చెల్లించారని మాత్రం చెప్పగలను. మినీ వేలంలో కేవలం ముగ్గురు ఆల్‌రౌండర్లు మాత్రమే ఉండటం వల్ల కూడా దీనికి ఒక కారణం. గతేడాది ఐపీఎల్‌లో అతడి పర్ఫామెన్స్ సరిగా లేదు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 టోర్నీలోనూ 4 మ్యాచుల్లో కేవలం 3 వికెట్లు తీసి 46 పరుగులే చేయగలిగాడు. గత 17 నెలలుగా అతడి ఆట నిలకడగా లేదు. 2022 జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మాత్రమే అతడు మంచి ఫామ్‌లో కనిపించాడు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో బౌండరీలు చాలా పెద్దగా ఉంటాయి" అంటూ ఆకాశ్ పేర్కొన్నాడు.
2022 టీ20 వరల్డ్ కప్‌లో 13 వికెట్లు తీసిన సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లోనూ మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దీంతో 2023 ఐపీఎల్ వేలంలో రూ. 18.50 కోట్లకు అతడిని దక్కించుకున్న పంజాబ్ కింగ్స్ తాజాగా అదే ధరకు అతడిని తీసుకుంది.