Sachin Tendulkar Pakistan : టీమ్ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను అభిమానులు ముద్దుగా 'క్రికెట్ గాడ్' గా పిలుచుకుంటారు. ఎందుకంటే టీమ్ఇండియాకు సచిన్ ఎనలేని సేవలు అందించాడు. ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డులను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్, 100 సెంచరీలు బాదిన రికార్డు ఇప్పటికీ సచిన్ పేరిటే ఉంది. అంతలా సచిన్ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. అయితే అలాంటి సచిన్ మన దేశం కంటే ముందు పాకిస్థాన్ తరఫున ఆడాడంటే నమ్మగలరా? అవును మీరు విన్నది నిజమే. 1987లో ఈ సంఘటన జరిగింది.
1987లో భారత్ పర్యటనకు వచ్చిన పాక్, ఆ సిరీస్‌కు ముందు ముంబయిలోని బ్రబోర్న్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. అప్పుడు పాకిస్థాన్ వెటరన్ ప్లేయర్స్ జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ లంచ్ కోసం హోటల్‌కు వెళ్లారు. మ్యాచ్ ప్రారంభమైనా ఇంకా మైదానానికి తిరిగిరాలేదు. దీంతో పాకిస్థాన్ జట్టుకు ఫీల్డర్లు లేరు. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఒకరిని ఫీల్డింగ్‌కు పంపాలని కోరారు. అప్పుడు బౌండరీ లైన్ వద్ద ఉన్న సచిన్ పాకిస్థాన్ తరఫున సబ్ స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేశాడు. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మైవే' (Playing it My Way)లో తెలిపాడు.
కపిల్ క్యాచ్ మిస్సింగ్
అయితే సచిన్ ఈ మ్యాచ్‌లో దాదాపుగా 25 నిమిషాలపాటు ఫీల్డింగ్ చేశాడు. ఆ సమయంలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేసిన సచిన్ అప్పటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ క్యాచ్ వదిలేశాడు. ఈ విషయాన్ని కూడా సచిన్ తన ఆత్మకథలో ప్రస్తావించాడు. కపిల్ దేవ్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యామని అందులో పేర్కొన్నాడు.
16ఏళ్లకే ఎంట్రీ
కాగా, సచిన్ పాకిస్థాన్ తరఫున పీల్డింగ్ చేసేటప్పుటికి అతడి వయసు 14 ఏళ్లు. ఆ తర్వాత రెండేళ్లకే అంటే 16ఏళ్లకు సచిన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 1989లో పాకిస్థాన్‌పై సచిన్ తన అంతర్జాతీయ డెబ్యూ మ్యాచ్ ఆడాడు. డెబ్యూ కంటే రెండేళ్లముందు పాక్ తరఫునే సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్ చేసి, మళ్లీ అదే జట్టుపై సచిన్ అరంగేట్రం చేయడం గమనార్హం.
ఎవరికీ అందనంత దూరంలో
సచిన్ తెందూల్కర్ తన కెరీర్ లో మొత్తంగా 200 టెస్టుల్లో 15,921 పరుగులు, 463 వన్డేల్లో 18,426 రన్స్ చేశాడు. 78 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 2,334 పరుగులు బాదాడు. అంతర్జాతీయంగా 100 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ సచినే. కాగా, 2013లో సచిన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు.