Sachin Met Amir: క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ జమ్మూకశ్మీర్‌కు చెందిన పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ (Amir Hussain Lone) ను శనివారం కలిశారు. రెండు చెతులు లేని అమీర్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో ఒకటి గతనెల సోషల్ మీడియాలో వైరలైంది. అమీర్ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయిన సచిన్, అతడిని తప్పకుండా కలుస్తానని అప్పుడే చెప్పారు. అయితే ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ అమీర్ ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు.
అభిమాన క్రికెటర్ తన ఇంటికి రావడం వల్ల అమీర్ భావోద్వేగానికి లోనయ్యారు. అమీర్ ఇంటికి వెళ్లిన సచిన్ అతడితో కాసేపు ముచ్చటించారు. తాను ఆటోగ్రాఫ్ (Autograph Cricket Bat) చేసిన బ్యాట్‌ను అమీర్‌కు బహుమతి ఇచ్చారు. ఆ బ్యాట్‌పై తన సంతకంతోపాటు 'ఈ అమీర్ రియల్ హీరో. నువ్వు ఇలాగే ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతూ ఉండాలి' అని రాశారు. ఈ వీడియో సచిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. అమీర్ జీవితం ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక 34 ఏళ్ల అమీర్ ప్రస్తుతం జమ్ము కశ్మీర్ పారా క్రికెట్ (Para Cricket Team Kashmir) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
అయితే అమీర్ హుస్సేన్ 8 ఏళ్ల వయసులో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అమీర్ తన రెండు చేతులు కోల్పోయాడు. అతడిలోని ప్రతిభను గుర్తించిన ఓ ఉపాధ్యాయుడు అమీర్ పారా క్రికెట్‌కు పరిచయం చేశాడు. మెడ, భుజం సాయంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 2013 నుంచి అమీర్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే గతనెల అమీర్ తన ఫేవరెట్ క్రికెటర్ సచిన్ జెర్సీ ధరించి బ్యాటింగ్ చేసిన వీడియో వైరలైంది. అతడికి సచిన్‌ను కలవాలనుందంటూ అప్పుడు చెప్పాడు. దీంతో వీడియో చూసిన సచిన్ 'అసాధ్యాన్ని అమీర్ సుసాధ్యం చేశాడు. ఒక రోజు తప్పకుండా అతడిని కలుస్తా' అని ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు.
14 ఏళ్ల క్రితం సచిన్ డబుల్ సెంచరీ - వన్డే హిస్టరీలో బెస్ట్ మూమెంట్!