IND vs ENG 3rd T20I : రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు స్కోర్ చేసి స్వల్ప లక్ష్యాన్ని టీమ్ఇండియా ముందు ఉంచింది. కానీ భారత ప్లేయర్ల వైఫల్యం వల్ల 26 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు గెలిచింది.
ముఖ్యంగా బెన్ డకెట్ (51), లివింగ్‌స్టన్ (43), లాంటి స్టార్ క్రికెటర్లు విజృంభించి జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఇచ్చారు. కానీ అందరి దృష్టి మాత్రం ఆ జట్టు వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌పై పడింది. అతడి పేలవ ఫామే దానికి కారణం. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో డకౌట్‌గా వెనుతిరిగిన సాల్ట్, చెన్నైలో 4 పరుగులు, తాజాగా 5 పరుగులే చేసి ఉసూరుమనిపించాడు.
పవర్ ప్లేలోనూ తడబడి నిరాశపరిచాడు. తొలి రెండు టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టగా, మూడో టీ20లో హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుతిరిగాడు.
ఇదిలా ఉండగా, అతడి పేలవ ఫామ్ అటు ఇంగ్లాండ్ అభిమానులతో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది. తను ఇలాగే బ్యాటింగ్ చేస్తే అది జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇక 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ సాల్ట్‌ను రూ. 11.50 కోట్ల భారీ ధరను వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.
గత సీజన్‌లో కేకేఆర్ తరఫున అద్భుతంగా ఆడటం వల్ల ఆర్‌సీబీ ఈ వేలంలో అతడిపై ఇంట్రెస్ట్ చూపించింది. అయితే ఇప్పుడు ఈ పెర్ఫామెన్స్ చూసి ఆర్సీబీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్‌లోనూ ఇదే సాగితే ఇక అంతే అని అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఇదే టీమ్‌లో ఉన్న లియామ్ లివింగ్ స్టోన్ మాత్రం అద్భుతంగా ఆడి జట్టును గట్టెక్కించాడు. తొలి రెండు టీ20ల్లో విఫలమైనప్పటికీ, మూడో మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడు. దూకుడుగా ఆడి 43 పరుగులు స్కోర్ చేశాడు. దీంతో ఫిల్ ఫెయిల్ అయినా కూడా లివింగ్‌స్టోన్ పెర్ఫామెన్స్ చూసి ఆర్సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడిని ఆర్‌సీబీ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది.