Rohit Sharma 2019 World Cup : 2019 వరల్డ్ కప్ ఎడిషన్‌ను భారత అభిమానులకు ఓ మర్చిపోలేని గాయంలాంటిదని అంటుంటారు. ఎంతో ఉత్సాహంగా ఆడతూ వచ్చిన టీమ్ఇండియాకు సెమీస్‌లో బ్రేక్ పడింది. ఆ ఓటమి కారణంగా భారత జట్టు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఎంఎస్ ధోనీ రనౌట్ కావడం వల్ల న్యూజిలాండ్ చేతిలో టీమ్ఇండియాకు ఘోర పరాజయం తప్పలేదు. అయితే తాజాగా ఈ టోర్నీ గురించి క్రికెటర్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ధోనీ ఈ టోర్నీలో లోయర్ ఆర్డర్లో బరిలోకి వచ్చాడు. అప్పుడే కీలకమైన నాలుగో స్థానం కోసం అంబటి రాయుడు, అలాగే విజయ్ శంకర్ మధ్య పోటీ జరిగింది. రాయుడును కాదని విజయ్‌ను ఆ స్థానానికి ఎంపిక చేయడం పట్ల నాటి సెలక్షన్ కమిటీపై అంబటి రాయుడు అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కానీ ఇదంతా జరగకుండా ధోనీనే వారి స్థానంలో వచ్చుంటే బాగుండేదంటూ రోహిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలో కెప్టెన్‌తో పాటు కోచ్ నిర్ణయమే కీలకమని చెప్పిన రోహిత్ వ్యక్తిగతంగా తనకు మాత్రం ధోనీ '4'వ ప్లేస్‌లో రావాలని అనిపించినట్లు వెల్లడించాడు.
"జట్టులో ధోనీ స్థానం అత్యంత కీలకమని అందరికీ తెలుసు. టీమ్ కోసమైనా అతడు నాలుగో స్థానంలో వచ్చి ఉంటే బాగుండేది. అప్పటి కెప్టెన్ విరాట్, కోచ్ ఆలోచనలను నేను ఏమాత్రం తప్పుపట్టట్లేదు. కానీ ఒకవేళ ఆ మ్యాచ్‌లో ధోనీ ముందే బ్యాటింగ్‌కు దిగుంటే నేను సంతోషపడేవాడిని" అని రోహిత్ అన్నాడు.
మ్యాచ్ సాగిందిలా :
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 239 పరుగులు స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలోకి దిగిన ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్, విరాట్ కోహ్లీ అందరూ ఒక్కో పరుగుకే పెవిలియన్ బాట పట్టారు. దీంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను రిషభ్ పంత్ (32), హార్దిక్ (32) ఓ మేరకు ఆదుకున్నారు. అయితే మంచి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు వచ్చిన దినేశ్ కార్తిక్ కూడా ఆరు పరుగులకే విఫలమయ్యాడు.
అయితే భారత్ సరిగ్గా 96/6 స్కోరులో ఉన్నప్పుడు ధోనీ-జడ్డూ 116 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ప్రయత్నించారు. అలా ఏడో స్థానంలో వచ్చిన ధోనీ (50), రవీంద్ర జడేజా (77)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. కానీ చివర్లో వికెట్లను కోల్పోవడం వల్ల భారత్ 221 పరుగులకే ఆలౌటైంది.
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా రోహిత్- CEAT అవార్డ్స్‌లో కెప్టెన్ ఘనత - Rohit Sharma 2024