Ind vs Ban Test 2024 : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత్, జైస్వాల్, గిల్ అద్భుతం చేశారు. 147 ఏళ్ల ప్రపంచ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్ కాగా, టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే భారత్ ఓపెనర్లు రోహిత్ - జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశారు.
దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జోడీగా రోహిత్- జైస్వాల్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డకెట్ - బెన్ స్టోక్స్ పేరిట ఉండేది. వీరిద్దరూ 26 బంతుల్లో 50+ స్కోరు చేశారు. తాజాగా ఇన్నింగ్స్‌లో రోహిత్- జైస్వాల్ జోడీ ఆ రికార్డు బద్దలుకొట్టింది.
ఫాస్టెస్ట్ 100 కూడా మనదే
అయితే జట్టు స్కోర్ 50 పరుగులు దాటిన తర్వాత ఓపెనర్ రోహిత్ (23) ఔటయ్యాడు. అయినప్పటికీ జైస్వాల్ జోరు తగ్గించలేదు. వన్‌డౌన్‌లో దిగిన శుభ్‌మన్ గిల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ - గిల్ జోడి 10.1 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగులు దాటించింది. టెస్టుల్లో వేగవంతమైన 100 పరుగులు కూడా ఇదే కావడం విశేషం.
This is some serious hitting by our openers 😳😳
— BCCI (@BCCI) September 30, 2024
A quick-fire 50-run partnership between @ybj_19 & @ImRo45 👏👏
Live - https://t.co/JBVX2gyyPf… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/1EnJH3X5xA
200 కూడా రికార్డే
తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు ఓపెనింగ్‌ను మిడిలార్డర్ బ్యాటర్లు సమర్థంగా వినియోగించుకున్నారు. వేగవంతమైన 50, 100, 150 తర్వాత టెస్టుల్లో ఫాస్టెస్ట్ 200 మార్క్ అందుకున్న ఘనత కూడా టీమ్ఇండియా తన పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 24.5 ఓవర్లలో 200 మార్క్ అందుకుంది. దీంతో టెస్టుల్లో అతి తక్కువ ఓవర్లలో ఈ మైలురాయి అందుకున్న జట్టుగా టీమ్ఇండియా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా (28.1 vs పాకిస్థాన్ 2017) రికార్డును బ్రేక్ చేసింది.