Rohan Bopanna Retirement : భారత జెర్సీలో ఇదే తన చివరి మ్యాచ్ అంటూ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న తాజాగా వ్యాఖ్యానించాడు. దీంతో ఆయన రిటైర్మెంట్ ప్రకటించారంటూ క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకున్న డెసిషన్ తమకు ఎంతో బాధ కలిగిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. అయితే దేశం తరఫున రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ప్రొఫెషనల్ గ్రాండ్‌స్లామ్ అలాగే ATP టోర్నీల్లో మాత్రం బోపన్న కొనసాగనున్నాడు.
"దేశం తరఫున నేను ఆడే చివరి ఈవెంట్ ఇదే. నేనే స్థితిలో ఉన్నానో నాకు ఈ రోజు ర్థమైంది. ఇకపై వీలైనంత వరకూ టెన్నిస్ సర్క్యూట్‌ను ఆస్వాదిస్తూ సాగుతాను. రెండు దశాబ్దాల పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. 2002 నుంచి ఇప్పటిదాకా భారత్‌కు ఆడుతూ వచ్చినందుకు నేనెంతో గర్వంగా ఉన్నాను" అంటూ బోపన్న ఓ ఎమోషనల్ ట్వీట్ షేర్ చేశాడు.
తొలి రౌండ్‌లో నిష్క్రమణ
పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా సోమవారం (జులై 29)న జరిగిన పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీతో కలిసి ఆడిన ఈ 44 ఏళ్ల స్టార్ ప్లేయర్, ఆఖరి వరకూ ఎంతో శ్రమించినప్పటికీ తొలి రౌండ్ కూడా దాటలేకపోయాడు. తమ ఆరంభ మ్యాచ్‌లోనే ఈ జోడీ 7-5, 6-2తో ఫ్రాన్స్‌కు చెందిన మోన్‌ఫిల్స్-రోజర్ వాజెలిన్ జంట చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
టెన్నీస్‌లో బోపన్న రికార్డులు
బోపన్న తన కెరీర్‌లో ఇప్పటి వరకూ 26 డబుల్స్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను కూడా అందుకున్నాడు. దీంతో పాటు డబుల్స్‌లో నెం.1 ర్యాంక్‌లోకి దూసుకెళ్లాడు.
2017లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌గానూ చరిత్రకెక్కాడు. 2010, 2023లో యూఎస్ ఓపెన్‌లో డబుల్స్ ఫైనల్ వరకూ చేరుకున్నాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో మూడుసార్లు (2013, 2015, 2023), అలాగే ఫ్రెంచ్ ఓపెన్‌లో (2022, 2024) రెండుసార్లు డబుల్స్ సెమీస్ వరకు వచ్చాడు. 2012, 2016 ఒలింపిక్స్‌లోనూ ఈ టెన్నిస్ స్టార్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
కాంస్య పోరులో మను బాకర్ జోడీ - ఫైనల్‌లో రమితకు నిరాశ - Paris Olympics 2024 July 27 Events