RCB vs LSG IPL 2024: 2024 ఐపీఎల్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (81 పరుగులు) హఫ్ సెంచరీతో అదరగొట్టగా, నికోలస్ పూరన్ (40* పరుగులు) మెరుపులతో లఖ్‌నవూ భారీ స్కోర్ సాధించింది.
అనంతరం లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 153 పరుగులకే ఆలౌటైంది. మహిపాల్ లొమ్రోర్ (33 పరుగులు) రాణించగా, విరాట్ కోహ్లీ (22), రజత్ పాటిదార్ (29) ఫర్వాలేదనిపించారు. లఖ్‌నవూ బౌలర్లలో మయంక్ యాదవ్ 3, నవీనుల్ హక్ 2, మణిమరన్ సిద్ధార్థ్ , యశ్ ఠాకూర్, మార్కస్ స్టాయినిస్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఆ రికార్డులేంటంటే?
ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు
- లఖ్‌నవూ బ్యాటర్ క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్‌తో 3వేల ఐపీఎల్ పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం డికాక్ 99 ఇన్నింగ్స్‌ల్లో 3046 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి.
- ఆర్సీబీ ప్లేయర్ దినేశ్ కార్తిక్ ఈ మ్యాచ్‌తో ఓ అరుదైన ఘనత సాధించాడు. అతడు టీ20ల్లో 300వ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.
- స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఓ ఘనత సాధించాడు. టీ20ల్లో ఒకే వేదికలో 100 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలిచాడు. విరాట్ టీ20ల్లో ఇప్పటివరకూ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 100 మ్యాచ్‌లు ఆడాడు.
- ఇక ఇదే మ్యాచ్‌లో కోహ్లీ ఓ చెత్త రికార్డ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో డెబ్యూ ప్లేయర్ సిద్ధార్థ్ విరాట్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఐపీఎల్లో పదిసార్లు (10) అరంగేట్ర బౌలర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ లిస్ట్‌లో పార్దీవ్ పటేల్ (13సార్లు), ఏబీ డివిలియర్స్ (11సార్లు) ముందున్నారు.
- గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్లో అత్యధిక సార్లు (16) డకౌటైన లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్ (17)టాప్‌లో ఉన్నారు.
- లఖ్‌నవూ పేసర్ మయంక్ యాదవ్ ఈ ఐపీఎల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 3+ వికెట్లు పడగొట్టాడు. అరంగేట్ర ఐపీఎల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆరో బౌలర్‌గా మయంక్ రికార్డు కొట్టాడు. అతడి కంటే ముందుగా లసిత్ మలింగ, అమిత్ మిశ్రా, మయంక్ మార్కండే, కూపర్, జోఫ్రా ఆర్చర్ ఈ ఘనత సాధించారు.
ఆర్సీబీ x లఖ్‌నవూ- రఫ్పాడించిన డికాక్, పూరన్- ఎవరు గెలిచారంటే? - RCB vs LSG IPL 2024