Rashid Khan vs Pakistan: 2023 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై తమ జట్టు చారిత్రక విజయం సాధించిన రోజు రాత్రంతా డ్యాన్స్ చేసినట్లు అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చెప్పాడు. ఆ రోజు తన సంబరాలకు అడ్డులేకుండా పోయిందని గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న రషీద్ రీసెంట్గా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం షేర్ చేసుకున్నాడు.
'పాకిస్థాన్‌పై గెలవడాన్ని మేం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆరోజు నా సంతోషానికి అడ్డు లేదు. గ్రౌండ్ నుంచి హోటల్‌కు నేను డ్యాన్స్ చేస్తూనే వెళ్లాను. అర్ధరాత్రి దాటినా నేను డ్యాన్స్ చేయడం ఆపలేదు. నేను గాయపడ్డ విషయాన్ని కూడా మర్చిపోయి సెలబ్రేట్ చేసుకున్నా. నా సంబరాలు చూసి మా ఫిజియో జాగ్రత్తగా ఉండాలంటూ పలుమార్లు గుర్తుచేశాడు. ఎవరి మాటా వినలేదు. మా జట్టు సభ్యులంతా నా సెలబ్రేషన్స్ చూసి ఆశ్చర్యపోయారు. నేను అంతలా సంబరాలు చేసుకోవడం వాళ్లెప్పుడూ చూడలేదు' అని రషీద్ అన్నాడు.
బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 283 పరుగుల టార్గెట్‌ను అఫ్గాన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (65 పరుగులు), ఇబ్రహీమ్ జర్దాన్ (87 పరుగులు) తొలి వికెట్‌కు 21 ఓవర్లలోనే 130 పరుగులు జోడించి మంచి ఆరంభం ఇచ్చారు. తర్వాత రహ్మత్ షా (77 పరుగులు*), హస్మతుల్లా షాహిదీ (48*) అఫ్గాన్‌కు చారిత్రక విజయం కట్టబెట్టారు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ వికెట్లు తీయకపోయినా 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి కట్టడి చేశాడు.
ఈ మెగాటోర్నీలో అఫ్గానిస్థాన్ స్థాయికి తగ్గ ప్రదర్శనే చేసింది. మొత్తం 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు నమోదు చేసింది. ఫలితంగా 8 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంతో టోర్నీని ముగించింది. ఇందులో మూడు సంచలన విజయాలు (ఇంగ్లాండ్‌పై 69 పరుగులు, శ్రీలంక 7 వికెట్లు, పాకిస్థాన్ 8 వికెట్లు) నమోదు చేసింది.
ODI World cup 2023 Rashid Khan : నాడు విలన్.. నేడు హీరో.. డిఫెండింగ్ ఛాంపియన్‌పై అదరగొట్టేశాడు!