PV Sindhu New Coach Anup Sridhar : ఫిన్లాండ్ వేదికగా జరగనున్న ఆర్కిటిక్ ఓపెన్ కోసం షట్లర్లు ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కోచ్ అనుప్ శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింధును మళ్లీ పోడియంపైకి తీసుకురావడమే ఆయన లక్ష్యమని వెల్లడించారు. గెలవాలనే తపన ఆమెలో ఉందని, ఆటలో స్థిరత్వం తీసుకురావడంలో తనకు సహకరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
"కొన్ని వారాల క్రితం నేను సింధు టీమ్‌తో మాట్లాడాను. ఈ నెల ప్రారంభం నుంచి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆమెకు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. మాకు ప్రోగ్రెస్ కనిపించింది. రెండు వారాల్లో ఐరోపాలో వేదికగా జరగనున్న టోర్నమెంట్లకు మేము వెళ్లనున్నాం. అయితే దీర్ఘకాలిక ఒప్పందంలో లేకపోవడం వల్ల 2025 కోసం మేం ప్లాన్ చేయడం కష్టం. వచ్చే ఏడాది జరగనున్న టోర్నమెంట్లలో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్రస్తుతం ఆటలో స్థిరత్వం తీసుకురావడంపైనే నేను ఫోకస్ పెట్టాను. ఈ మూడు వారాల్లో చాలా ప్రోగ్రెస్ కనిపించింది. కానీ, ఇంకా చేయాల్సింది చాలా ఉంది" అని అనూప్ వెల్లడించారు.
త్వరలో ఫిన్లాండ్ వేదికగా జరగనున్న ఆర్కిటిక్ ఓపెన్‌తోనే సింధుతో అనూప్ పని చేయబోతున్నారంటూ సింధు తండ్రి తాజాగా మీడియాకు తెలిపారు. "బెంగళూరులో ఇక సింధు ట్రైనింగ్ కంటిన్యూ చేయదు. ఆమె హైదరాబాద్‌లోనే శిక్షణ తీసుకుంటుంది. ప్రస్తుత కోచ్ ఆగస్ సాంటసోతో ఒప్పందం ముగియనుండటం వల్ల ఫిన్లాండ్లో జరిగే టోర్నీ వరకు సింధుకు అనూప్ శ్రీధర్ కోచ్‌గా వ్యవహరిస్తారు. గతంలో పని చేసిన కొరియా కోచ్ పార్క్ సంగ్ పేరు కూడా పరిగణనలోకి వచ్చినప్పటికీ, అతడిని కొనసాగించడం వల్ల సానుకూల ఫలితాలు రావట్లేదని భావించాం" అంటూ సింధు తండ్రి రమణ పేర్కొన్నారు.
గత రెండు ఒలింపిక్స్‌లో సింధు మెరుగైన ప్రదర్శనతో అదరగొట్టింది. అయితే కామెన్వెల్త్ గేమ్స్ తర్వాత సింధు ఫామ్ కోల్పోయింది. ఈ క్రమంలో ఆమె గాయపడింది. గాయం నుంచి కోలుకున్నాక కూడా జరిగిన పలు టోర్నీల్లో ఆశించిన స్థాయిలో సింధు ప్రదర్శన చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. అయితే విశ్వక్రీడలు అనగానే సింధు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగినప్పటికీ ప్రీ క్వార్టర్స్‌లో ఆమెకు నిరాశ తప్పలేదు. దీంతో క్రీడాభిమానులు కూడా ఆమె ఓటమి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
మలేషియా మాస్టర్స్ నుంచి కాన్ఫిడెన్స్ తీసుకెళ్తా- అలా చేసుంటే బాగున్ను!: పీవీ సింధు - PV Sindhu