PV Sindhu Malaysia Masters 2024 : తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో ఓటమిపాలైంది. సూపర్ సిరీస్ టైటిళ్ల కరవు తీర్చుకోవాలని, రెండేళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ జి యి చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో ఓడిపోయింది. అయితే చైనాకు చెందిన ప్రపంచ 7వ ర్యాంకర్ వాంగ్ జి యితో ఓడిపోయినప్పటికీ, తాను చాలా పాజిటివ్స్, కాన్ఫిడెన్స్‌ను ఇంటికి తీసుకెళ్తున్నానని సింధు(ప్రపంచ 15వ ర్యాంకు) చెప్పింది. ప్రస్తుతం సింధు పారిస్‌లో తన మూడో ఒలింపిక్ పతకాన్ని గెలిచే లక్ష్యంతో ఉంది.
79 నిమిషాల ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో చివరి సెట్‌లో 11-3 ఆధిక్యంతో పీవీ సింధు టైటిల్ గెలిచేలా కనిపించింది. కానీ ఊహించని రీతిలో 21-16, 5-21, 16-21 తేడాతో ఓడిపోయింది. ఊహించిన ఫలితాన్ని పొందలేకపోవడం బాధాకరమని, లీడ్‌ను మెయింటైన్ చేస్తూ చివరి సెట్‌ను గెలిచి ఉండాల్సిందని అభిప్రాయపడింది. చివరి గేమ్‌లో గుడ్ ర్యాలీస్ వచ్చాయని, వాంగ్ కూడా తిరిగి పుంజుకుందని చెప్పింది. మే 28 నుంచి జరిగే సింగపూర్ ఓపెన్‌కు ముందు కోచ్‌తో కలిసి పనిచేస్తానని, మరింత బలంగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తానని సింధు తెలిపింది.
ఫైనల్స్‌కు వచ్చినందుకు సంతోషం
"ఓవరాల్‌గా, ఇది చాలా మంచి మ్యాచ్ అని నేను చెప్పగలను. ఈ మ్యాచ్‌తో పాటు మొత్తం టోర్నమెంట్ నుంచి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. నేను ఫైనల్స్‌కు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను బాగా ఆడాను. ఈ మ్యాచ్‌లు కచ్చితంగా నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. కానీ నేను గెలిచి ఉండాల్సింది. రెండో సెట్‌లో 16-4 లేదా 17-4 లీడ్‌లో ఉన్నాను. ఇది చాలా ఎక్కువ గ్యాప్. కవర్ చేయడం చాలా కష్టం. కాకపోతే నేను వరుసగా తప్పులు చేశాను. నేను ఆమెకు భారీ ఆధిక్యాన్ని అందించాను. కానీ మూడో గేమ్‌లో నేను బాగా రాణించాను. నేను గెలిచి ఉండాల్సింది. 11-3, 13-8 లీడ్‌ను నేను మెయింటైన్ చేయాల్సింది" అని సింధు చెప్పింది.
నెక్స్ట్ టోర్నమెంట్‌పై ఫోకస్
"నేను తిరిగి వెళ్లి, నా కోచ్‌తో కలిసి పని చేస్తాను. మెరుగవ్వాల్సిన అంశాలేవో చూస్తాను, సింగపూర్‌కు సిద్ధమవుతాను. ఈ టోర్నమెంట్‌తో ముగియలేదు, తదుపరి టోర్నమెంట్‌కు తిరిగి సిద్ధం కావడం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడం కీలకం. తదుపరి టోర్నమెంట్‌పై దృష్టి సారిస్తాను, విశ్రాంతి తీసుకుంటాను, మెరుగ్గా సిద్ధమవుతాను" అని సింధు పేర్కొంది.
2023లో మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ తర్వాత సింధూ ఫైనల్స్‌లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. సింధు చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచింది. తర్వాత గాయంతో దాదాపు ఆరు నెలల పాటు గేమ్‌కు దూరమైంది. గత ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ కోర్టులో అడుగు పెట్టింది. హైదరాబాద్‌లోని ప్రకాష్ పదుకొణె అకాడమీలో పీవీ సింధు ప్రస్తుతం శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే.