Paris Olympics 2024 Vinesh Phogat Career : వినేశ్ ఫోగాట్ ఇప్పుడీ పేరు మార్మోగిపోతుంది. అందుకు కారణం పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె చేసిన ప్రదర్శనే. గతంలో 2016 రియో ఒలింపిక్స్‌లో ఎన్నో ఆశలతో బరిలో దిగిన ఆమె క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఆ పోరులో మోకాలికి గాయం అవ్వడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ స్ట్రెచర్‌పై నిష్క్రమించింది. ఇక ఈ గాయంతో ఆమె కెరీర్లో కోలుకోవడం కష్టమే అన్నారు.
2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత క్రమశిక్షణ ఉల్లంఘన అంటూ ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. అలానే గతేడాది బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆమె దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకు దూరంగా ఉండిపోయింది. దీంతో వినేశ్ పని అయిపోయిందని, తిరిగి మ్యాట్‌పై అడుగుపెట్టినా కెరీర్ కొనసాగించడం కష్టమే అన్నారు.
కానీ ఇప్పుడామె వీటన్నింటికీ చెక్ పెట్టింది. తనకు ఎదురైన సవాళ్లను దాటి, అంతులేని పోరాటంతో పారిస్ ఒలింపిక్స్‌లో పతక కలను నిజం చేసుకుంది. ఇప్పటికే కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో గోల్డ్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యాలు దక్కించుకున్న ఆమె ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ అందుకోనుంది. మంగళవారం(ఆగస్ట్ 6) గూజ్మన్ (క్యూబా)తో సెమీఫైనల్లో తలపడ్డ వినేశ్ 5-0 తేడాతో నెగ్గి ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైనట్టైంది.
ప్రయాణం సాగిందిలా - వినేశ్ ఫొగాట్ది హరియాణా. ఆమె రెజ్లింగ్ నేపథ్యం ఉన్న కుటుంబం. తక్కువ సమయంలోనే అంతర్జాతీయ వేదికలపై అదరగొట్టింది. 2014, 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్‌తో సత్తా చాటింది.
2018 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. కానీ ఆమెకు ఒలింపిక్ పతకం మాత్రం ఇంత కాలం కలగానే మిగిలింది. 2016, 2020 ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌లో నిష్క్రమించింది వినేశ్. దీంతో ఈ సారి పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె పోటీ చేస్తుందా లేదా అని చాలా మందిలో అనుమానాలు వచ్చాయి.
ఎందుకంటే గాయం, డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం వల్ల వినేశ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేకపోయింది. మహిళా రెజ్లర్లను లైంగింకంగా వేధిస్తున్నాడంటూ బ్రిజ్‌భూషణ్‌పై ఆరోపణలు చేసిన బజ్‌రంగ్, సాక్షి మలిక్ తదితర స్టార్ రెజ్లర్లతో కలిసి పోరాటం చేసింది. దిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ధర్నా చేసి సంచలనంగా మారింది.
ఆందోళనలను విరమించాలని ఎన్ని బెదిరింపులు వచ్చినా, దీక్ష శిబిరాన్ని ఖాళీ చేయించినా ఎక్కడా తగ్గలేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండానే ఇతర రెజ్లర్లతో కలిసి ఉద్యమాన్ని కొనసాగించింది. రోడ్డుపైనే నిద్రించింది. పతకాలను గంగలో కలిపేందుకు కూడా సిద్ధమైంది. ఖేల్‌రత్న సహా తన ఇతర పురస్కారాలను వెనక్కిచ్చేసింది. ఇక చివరకు బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తొలగించడంతో ఆందోళన విరమించారు రెజ్లర్లు. అయితే ఈ ఉద్యమం వల్ల దేశంలో రెజ్లింగ్ కార్యకలపాలన్నీ ఆగిపోవాల్సి వచ్చింది.
గాయం, బరువు మారడం - ఇక ఈ ఉద్యమం పూర్తైన తర్వాత వినేశ్ ఆటపై దృష్టి సారిచేందుకు ప్రయత్నించింది. కానీ మళ్లీ గాయం వెంటాడింది. దీంతో ఆమె ఆసియా క్రీడలకు దూరమైంది. అనంతరం ఈ ఏడాది మార్చిలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో 55 కేజీల విభాగంలో పోటీ పడి ఛాంపియన్‌గా అవతరించింది.
అనంతరం పలు కారణాల వల్ల వినేశ్ 50 కేజీల విభాగంలోకి మారక తప్పలేదు. వైద్యులు 57 కేజీలకు మారితే ఉత్తమం అని సూచించారు. కానీ వినేశ్ తగ్గేందుకే ఆసక్తి చూపించింది. అలా 50 కేజీల విభాగంలోనూ సత్తా చాటింది.
2018 ఆసియా క్రీడల్లో ఈ విభాగంలోనే గోల్డ్ మెడల్ సాధించింది. అదే స్ఫూర్తితో ముందుకెళ్లింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్‌లో మంచి ప్రదర్శన చేసి ఒలింపిక్ బెర్తు అందుకుంది. అలా అత్యధిక సార్లు ఒలింపిక్స్ బరిలో దిగిన భారత మహిళా రెజ్లర్‌గా ఘనత అందుకుంది.
ఇక ఈ పారిస్ ఒలింపిక్స్‌కు ముందు స్పానిష్ గ్రాండ్ ప్రిలో విజయం సాధించడం వినేశ్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. దీంతో పారిస్‌లో ఒలింపిక్స్‌లో జోరుతో ముందుకెళ్లింది.
చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్ - రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం ఖాయం
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ- 12ఏళ్లలో ఇదే తొలిసారి! - Paris Olympics 2024