Paris Olympics 2024 Vinesh Phogat Disqualification : పారిస్ ఒలింపిక్స్‌లో ఎదురైన చేదు అనుభవంతో మనస్తాపం చెందిన వినేశ్ ఫోగాట్(29) అంతర్జాతీయ రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించింది. ఎందుకంటే 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా, ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగం ఫైనల్స్‌లో పాల్గొనకండా వినేశ్‌ను డిస్‌క్వాలిఫై చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ విరెన్ రస్కిన్హా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. వినేశ్ ఫోగాట్ వ్యవహారానికి సంబంధించిన కొన్ని సందేహాలకు సమాధానం ఇచ్చారు.
వినేశ్ 50 కేజీల కేటగిరీలో ఎందుకు పోటీ చేసింది?
వినేశ్ సాధారణ బరువు దాదాపు 55 కిలోలు. కానీ చాలా మంది రెజ్లర్ల మాదిరిగానే తన సాధారణ బరువు కన్నా 3-4 కిలోల తక్కవ కేటగిరీలో పోటీపడుతుంది. కొన్నేళ్లుగా 53 కేజీల విభాగంలో రెజ్లింగ్ చేస్తోంది. అయితే ఆమె 2023 ఆగస్టులో ACL సర్జరీ చేయించుకున్న తర్వాత, మరో రెజ్లర్ ఆంటిమ్ పంఘల్ 53 కిలోల విభాగంలో భారతదేశం తరఫున ఎంపికైంది. ఒలింపిక్స్‌లో ఒక్కో వెయిట్ కేటగిరీలో ఒక్కో దేశానికి ఒక రెజ్లర్ మాత్రమే పోటీ పడాలనే నిబంధన కారణంగా వినేశ్ 50 కేజీల విభాగంలో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో విజయం సాధించి తన స్థానాన్ని కైవసం చేసుకుంది.
2వ రోజు సమస్య ఎందుకు వచ్చింది?
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) నిబంధనల ప్రకారం రెజ్లర్ల బరువు, పోటీ జరిగే రెండు రోజులు(సెమీ ఫైనల్, ఫైనల్), వెయిట్ కేటగిరీలోపే ఉండాలి. మొదటి రోజు వినేశ్ తన కేటగిరీ వెయిట్ మెయింటైన్ చేసింది. 50 కిలోల లోపే ఉంది. అయితే లైట్‌గా శక్తిని(50 కేజీల వరకు) పెంచుకోవడానికి స్మాల్ రికవరీ మీల్ చేసింది. కానీ రీహైడ్రేషన్ వల్ల ఆమె బరువు 52.7 కిలోలకు పెరిగింది.
దీంతో ఈ అదనపు 2.7 కిలోల బరువును మరుసటి రోజు(ఫైనల్) ఉదయం 7:15 గంటల్లోపు తగ్గడానికి ఆమెకు 12 గంటల సమయం మాత్రమే మిగిలింది. కానీ ఎట్టకేలకు ఆమె ఒక రాత్రిలో 2.6 కిలోల బరువు తగ్గింది. వంద గ్రాములు మాత్రమే ఎక్కువ ఉండిపోయింది. అందుకే ఆమె డిస్‌క్వాలిఫై అయింది.
వినేశ్, ఆమె టీమ్ ఇంకేదైనా చేసుండొచ్చా?
ఆమె టీమ్ చేయగలిగినదంతా చేసింది. స్థిరంగా వెయిట్ కంట్రోల్ చేయడం రెజ్లర్లకు సురక్షితం కాదు. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. వారి శిక్షణపై ప్రభావం చూపుతుంది. వైద్యుల సలహా ప్రకారం, నార్మల్ వెయిట్‌లోనే శిక్షణ పొందడం మంచిది.
రెండో రోజు బరువు తగ్గించేందుకు, వైద్యులు, పోషకాహార నిపుణులు, ఆమె కోచ్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO), చెఫ్ డి మిషన్ (CDM) సహా వినేశ్, ఆమె టీమ్ రాత్రంతా అవిశ్రాంతంగా శ్రమించారు. వినేశ్ అస్సలు నిద్రపోలేదు. తాను చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేసింది. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అవసరమైనంత బరువు తగ్గించలేకపోయారు. ఆమె జుట్టు కత్తిరించినా ప్రయోజనం లేకపోయింది. చాలా తక్కువ మార్జిన్‌తో(100 గ్రాములు) డిస్‌క్వాలిఫై అయింది. ఇంకేం చేసినా పెద్ద వ్యత్యాసం కనిపించే అవకాశం లేకుండా పోయింది.
ఏదైనా కుట్రకు అవకాశం ఉందా?
అలాంటివి జరగడానికి అవకాశం లేదు.
IOA ద్వారా అప్పీల్ చేసే అవకాశం ఉందా?
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) వారు అప్పీల్ చేయాలనుకుంటే, ఐఓఏ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
చట్టపరమైన పరిష్కారానికి అవకాశం ఉందా?
మేము చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నాం. కానీ ఈ విషయంలో ప్రొఫెషనల్ కాదు కాబట్టి, ఇప్పుడే ఏం చెప్పలేను.
బరువు కొలిచేటప్పుడు గాయమనే సాకుతో తప్పించుకోకూడదా?
లేదు. ఒక ఆటగాడు తమను తాము అనర్హులుగా లేదా అనారోగ్యంతో ఉన్నట్లు ప్రకటించుకోలేరు. తప్పనిసరిగా టోర్నమెంట్ డాక్టర్లు నిర్ధారించాలి. సరైన బరువు లేకపోతే ఆటోమేటిక్‌గా డిస్‌క్వాలిఫై అవుతారు.
100 గ్రాములు మాత్రమే కదా? మరింత సమయం అడిగారా?
చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO), చెఫ్ డి మిషన్ (CDM) అధికారుల నుంచి అదనపు సమయం కోరారు. కానీ అదనపు సమయం మంజూరు చేయలేదు.
వినేశ్ అభ్యర్థనను స్వీకరించిన 'కాస్' - తనపై విధించిన అనర్హత వేటును సవాలు చేస్తూ వినేశ్ ఫోగాట్ చేసిన అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) స్వీకరించింది. దీనిపై శుక్రవారం(ఆగస్ట్ 9) ఉదయం 10గంటలకు (పారిస్ కాలమానం ప్రకారం) విచారణ చేయనుందట. అలాగే న్యాయవాదిని నియమించుకునేందుకు అవకాశం కల్పించాలని వినేశ్ కోరగా దానికి కూడా కాస్ అంగీకరించింది. దీంతో మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వేను నియమించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
భారత్ ఖాతాలో మరో పతకం - కాంస్య పతకం గెలుచుకున్న హాకీ జట్టు - Paris Olympics 2024 India Hockey
కాంస్య పతకంతో భారత హాకీ జట్టు గెలుపు సంబరాలు - మోదీ, ముర్ము అభినందనలు - Paris Olympics 2024