Nino Salukvadze Paris Olympics 2024 :సుదీర్ఘకాలం క్రీడల్లో కొనసాగడమనేది అందరికీ సాధ్యం కాదు. అందులోనూ ఒలింపిక్స్‌కి పది సార్లు క్వాలిఫై అవ్వడం అంటే మాటలా! మరి ఈ రికార్డును ఓ జార్జియన షూటర్ అందుకుంది. ఆమె పేరు నినో సలుక్వాడ్జే. మరి ఆమె ఒలింపిక్స్ జర్నీ ఎలా సాగిందంటే?
ప్రపంచంలోనే పాపులర్ స్పోర్ట్స్ షూటర్లలో నినో ఒకరు. ఇప్పటి వరకు ఏకంగా తొమ్మిది ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. వేర్వేరు ఒలింపిక్స్‌లో 1 స్వర్ణం, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఇప్పుడు ఆమె పారిస్‌లో జరిగే 2024 సమ్మర్ ఒలింపిక్స్‌కి సన్నద్ధమవుతున్నారు. అలా ఈ విశ్వ క్రీడా పోటీల్లో పదోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
1988లో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడంతో నినో ప్రస్తానం మొదలైంది. అప్పటి నుంచి 36 ఏళ్లుగా ఆమె సుదీర్ఘ ప్రయాణం సాగుతోంది. 2008 బీజింగ్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో జార్జియా తరఫున కాంస్యాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్యా, జార్జియా మధ్య యుద్ధం జరుగుతోంది. అయినప్పటికీ తన రష్యన్ ప్రత్యర్థి నటాలియా పాడెరినాను నినో హగ్ చేసుకోవడం అప్పటి వార్తలో నిలిచింది.
ఒలింపిక్సే కాదు అందులోనూ ఛాంపియనే
ఒలింపిక్స్‌లోనే కాకుండా నినో సలుక్వాడ్జే వరల్డ్, యూరోపియన్ ఛాంపియన్‌షిప్స్‌తో పాటు, ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ టైటిల్స్ గెలిచారు. గతేడాది జనవరిలో క్రొయేషియాలోని ఒసిజెక్ వేదికగా జరిగిన ISSF గ్రాండ్పిక్స్లో విజయం సాధించారు.
తనయుడితో బరిలోకి
2016 రియో ఒలింపిక్స్‌లో నినో, తన కుమారుడు సోట్నే మచావరియానితో కలిసి పోటీపడింది. అలా షూటింగ్ ఈవెంట్స్‌లో జార్జియాకు ప్రాతినిధ్యం వహించిన మొదటి తల్లి, కొడుకుగా ఈ ఇద్దరూ చరిత్రకెక్కారు.
పారిస్ వెరీ స్పెషల్
నినో ప్రస్తుతం తన 10వ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. దీంతో కెనడియన్ ఈక్వెస్ట్రియన్ ఇయాన్ మిల్లర్ రికార్డును ఆమె సమం చేయనున్నారు. పది ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డుకెక్కనున్నారు. 1988 నుంచి 2020 వరకు జరిగిన ప్రతి ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొన్నారు.
తండ్రి చివరి కోరిక
నినో తన కెరీర్‌లోని ముఖ్యమైన క్షణాలుగా తన కొడుకుతో కలిసి రియోలో పోటీ చేయడమని గుర్తు చేసుకున్నారు. కెరీర్‌లో అధిగమించిన సవాళ్లను ప్రస్తావించారు. అలానే పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం తన తండ్రి వక్తాంగ్ చివరి కోరిక అని తెలిపారు. మొదటి నుంచి ఆమెకు తన తండ్రే శిక్షణ ఇవ్వడం గమనార్హం.
నినో సలుక్వాడ్జే ఒలింపిక్ జర్నీ
1988 సమ్మర్ ఒలింపిక్స్, సియోల్ : 19 సంవత్సరాల వయస్సులో, సోవియట్ యూనియన్ తరఫున నినో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం, 10 మీటర్ల ఈవెంట్‌లో రజతం గెలుచుకున్నారు.
1992 సమ్మర్ ఒలింపిక్స్, బార్సిలోనా : మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో వరుసగా ఐదు, పదో స్థానంలో నిలిచారు.
1996 సమ్మర్ ఒలింపిక్స్, అట్లాంటా : మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మహిళల 25మీ పిస్టల్ ఈవెంట్‌లో నినో వరుసగా ఐదు, ఏడు స్థానాలు దక్కించుకున్నారు.
2000 సమ్మర్ ఒలింపిక్స్, సిడ్నీ : మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్, మహిళల 25మీ పిస్టల్ ఈవెంట్‌లో ఆమె వరుసగా 25, 11వ స్థానంలో నిలిచారు.
2004 వేసవి ఒలింపిక్స్, ఏథెన్స్ : మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్, మహిళల 25మీ పిస్టల్ విభాగాల్లో టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నారు.
2008 సమ్మర్ ఒలింపిక్స్, బీజింగ్ : 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం గెలుపొందారు.
2012 సమ్మర్ ఒలింపిక్స్, లండన్ : లండన్ 2012, టోక్యో 2020 ప్రారంభ వేడుకల్లో ఆమె జార్జియాను ప్రాతినిథ్యం వహించేందుకు ఎంపికయ్యారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో వరుసగా 33, 15 స్థానాలకు పరిమితమయ్యారు.
2016 సమ్మర్ ఒలింపిక్స్, రియో డి జెనీరో : ఈ ఏడాదే ఆమె కుమారుడు సోట్నే మచవారియానితో కలిసి పోటీ పడ్డారు. కానీ దురదృష్టవశాత్తు ఇద్దరూ పతకానికి దూరమయ్యారు.
2020 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ : 52 సంవత్సరాల వయస్సులో, నినో సలుక్వాడ్జే తన తొమ్మిదో ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. మొదటి మహిళా అథ్లెట్‌గా కొత్త రికార్డును నెలకొల్పారు.
పారిస్ కోసం సన్నాహాలు : ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌కి నినో సన్నద్ధమవుతున్నారు. 'పది ఒలింపియాడ్‌లు-ఇది నా మొత్తం జీవితం' అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
పారిస్ ఒలింపిక్స్‌కు 70వేల కోట్ల ఖర్చు- హిస్టరీలో రిచ్చెస్ట్ సీజన్ ఇదే! - PARIS OLYMPICS 2024