Paris Olympics 2024 Dutee Chand on Gender Row : పారిస్ ఒలింపిక్స్ 2024లో ప్రస్తుతం లింగ వివాదం గురించి జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ స్పందించింది. తాను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.
‘‘అధిక టెస్టోస్టిరాన్ స్థాయులు ఉన్న వ్యక్తి పోటీ చేయడంపై ఉన్న ఐఓసీ నిబంధనను నేను కూడా గతంలో సవాల్ చేశాను. హార్మోన్ స్థాయులు అథ్లెట్ ప్రదర్శనను మెరుగుపరచలేవు అని గుర్తించారు. ఆ కాంట్రవర్సీ జరిగినప్పుడు నేను ఎంతో వేదన పడ్డాను. నా జెండర్‌కు సంబంధించి పెద్ద వివాదాన్ని ఎదుర్కొన్నాను. ఒలింపిక్ మ్యాచ్‌లో ఏంజెలా ఆట నుంచి నిష్క్రమించింది. అల్జీరియా బాక్సర్ టెస్టోస్టిరాన్ స్థాయుల గురించి కంప్లైంట్ చేసింది. ఒలింపిక్స్ బరిలోకి దిగినప్పుడు ఎన్నో పరీక్షలు చేస్తారు. సోషల్ మీడియాలో దీనిపై కాంట్రవర్సీ చేయడం సరి కాదని నేను భావిస్తున్నాను’’ అని ద్యుతి చెప్పుకొచ్చింది.
ప్రస్తుత ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ 66 కేజీల ప్రిక్వార్టర్స్‌లో ఏంజెలా కెరాని (ఇటలీ), ఇమానె ఖెలిఫ్ (అల్జీరియా) తలపడ్డారు. అయితే వారి మధ్య జరిగిన బౌట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఖెలిఫ్‌లో ఎక్స్‌వై క్రొమోజోమ్స్, టెస్టోస్టిరాన్‌లు పురుషుల స్థాయిలో ఉన్నాయని డీఎన్‌ఏ టెస్ట్‌లో తేలింది. ఇక ఇదే సమయంలో బౌట్లో ఖెలిఫ్ పంచ్ ఏంజెలా ముఖంపై బలంగా తాకింది. దీంతో రక్తం కూడా వచ్చింది. అనంతరం ఏంజెలా తనంతట తానే బౌట్ నుంచి వైదొలిగింది.
ఈ క్రమంలోనే ఖెలిఫ్ వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఖైలిఫ్కు మద్దతుగా నిలుస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. అలా తాజాగా ద్యుతి కూడా మాట్లాడింది. ఆమె కూడా అల్జీరియా బాక్సర్ వలే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపింది.