On This Day 2007 T20 WorldCup Final : టీ20 క్రికెట్‌లో టీమ్‌ఇండియానే తొలి విశ్వ విజేత అన్న సంగతి తెలిసిందే. సీనియర్లు లేని టీమ్ ఇండియా ధోనీ నాయకత్వంలో ఈ అరుదైన ఘనత సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చారిత్రక విజయం అందుకుని భారత క్రికెట్ అభిమానులు సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది.
సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజు టీమ్‌ఇండియా ఆ అపురూప విజయం సాధించింది. ఇంకా ఆ మధుర స్మృతులు చాలా సందర్భాల్లో అభిమానుల కళ్లల్లో కదలాడుతూనే ఉంటాయి. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును సమర్థవంతంగా నడిపించిన కెప్టెన్ ధోనీ, నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితుల్లో జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవర్, మిస్బా స్కూప్ షాట్‌ను అనూహ్యంగా క్యాచ్ పట్టిన శ్రీశాంత్, ఇలా ఎన్నో ఈ విజయం సమష్టి కృషికి నిదర్శనం.
కెప్టెన్సీలో అపర చాణక్యుడు - పాకిస్థాన్ విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఒక్క వికెట్ తీస్తే టీమ్ ఇండియా విజయం. రెండు సిక్సులు బాదితే పాకిస్థాన్ గెలుపు. ఇద్దరికీ సమాన అవకాశాలే. దీంతో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. అలాంటి సమయంలోనూ కెప్టెన్ ధోనీ ఎంతో ప్రశాంతంగా కనిపించాడు.
బంతిని యువ పేసర్ జోగిందర్ శర్మకు అప్పగించాడు. అప్పుడు అతడు వేసిన మొదటి బంతి వైడ్‌గా వెళ్లింది. ఆ తర్వాత బంతి డాట్‌బాల్. ఇక మూడో బాల్‌ను మిస్బా (38 బంతుల్లో 43; 4x6) సిక్స్‌గా మలవడంతో ఉత్కంఠ మరింత తారా స్థాయికి చేరింది. నాలుగు బంతుల్లో 6 పరుగులుగా సమీకరణం మారింది. దీంతో ప్రతి ఒక్కరూ మహీ నిర్ణయం సరైంది కాదని అనుకున్నారు. అదే సమయంలో మహీ జోగిందర్ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడాడు. తర్వాత జోగిందర్ వేసిన నాలుగో బంతి ఆఫ్ స్టంప్‌కు ఆవల వచ్చింది. అప్పుడు మిస్బా రివర్స్ స్కూప్ బాదాడు. దీంతో బంతి గాల్లోకి లేచింది. ఆ క్యాచ్‌ను అనూహ్యంగా బంతిని శ్రీశాంత్ అందుకున్నాడు. భారత్ విజయం సాధించింది. ఆ మధుర జ్ఞపకాలు ఇంకా అభిమానుల గుండెల్లో పదిలంగానే ఉన్నాయి.
#OnThisDay in 2007!
— BCCI (@BCCI) September 24, 2021
The @msdhoni-led #TeamIndia created history as they lifted the ICC World T20 Trophy. 🏆 👏
Relive that title-winning moment 🎥 👇 pic.twitter.com/wvz79xBZJv
చివర్లో రోహిత్ సూపర్ ఇన్నింగ్స్ - టీమ్‌ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణిత ఓవర్లలో 157/5 స్కోర్ చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ (54 బంతుల్లో 75; 8x4, 2x6) టాప్ స్కోరర్. చివర్లో రోహిత్ శర్మ (16 బంతుల్లో 30; 2x4, 1x6) అదిరే బ్యాటింగ్ చేయడంతో జట్టుకు మంచి స్కోర్ లభించింది. ఛేదనలో పాక్ తడబడినప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మిస్బా భారత్‌ను బంబేలెత్తించాడు. ఓవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు అతడు సిక్సర్లతో అదరగొట్టాడు. చివరి వరకూ క్రీజులో ఉంచి మ్యాచ్ గెలిపించేలా కనిపించాడు. కానీ ధోనీ చాణక్యానికి, జోగిందర్ బౌలింగ్‌కు, శ్రీశాంత్ క్యాచ్‌కు దొరికిపోయి నిరాశతో వెనుదిరిగాడు. దీంతో పాకిస్థాన్ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. టీమ్‌ఇండియా బౌలర్లలో ఇర్ఫాన్, ఆర్పీ సింగ్ తలో మూడేసి వికెట్లు తీయగా, జోగిందర్ శర్మ రెండు వికెట్లు తీశాడు.
గ్రూప్ దశ ఎలా సాగిందంటే? - స్కాట్లాండ్‌తో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. రెండో మ్యాచ్‌లో భారత్ - పాకిస్థాన్ స్కోర్లు సమం అవ్వడంతో బౌల్ అవుట్‌కు వెళ్లింది. అయితే టీమ్‌ఇండియా 3-0 తేడాతో పాక్‌పై గెలిచి మ్యాచ్ దక్కించుకుంది. అలానే సూపర్-8కు అర్హత సాధించింది. రాబిన్ ఉతప్ప (50) హాఫ్ సెంచరీ బాది టీమ్ ఇండియా విజయంలో కీలకంగా వ్యవహరించాడు. పాకిస్థాన్ కూడా తమ తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను ఓడించి తదుపరి దశకు చేరింది. మొత్తంగా మూడు పాయింట్లతో గ్రూప్ దశను అగ్రస్థానంతో ముగించింది టీమ్ ఇండియా.
సూపర్ 8లోనూ టాప్ - న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి టాప్ జట్లతో ఈ సూపర్-8లో తలపడింది భారత్. న్యూజిలాండ్‌పై తప్ప అన్ని మిగతా మ్యాచుల్లోనూ భారత్ గెలుపొందింది. ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అప్పటి యంగ్ ప్లేయర్ ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (50) హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా సూపర్-8 గ్రూప్ నుంచి టాప్‌లో ఉండి సెమీఫైనల్‌కు వెళ్లింది భారత్.
యువరాజ్ కీలక ఇన్నింగ్స్ - సూపర్-8 ఫేజ్‌లో రెండు గ్రూప్‌ల నుంచి భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీ ఫైనల్లో టీమ్‌ఇండియా - ఆస్ట్రేలియా, కివీస్ - పాకిస్థాన్ జట్లు పోటీపడ్డాయి.
అప్పటికే ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌లను అత్యధికంగా సాధించిన జట్టుగా రికార్డుకెక్కింది. ఆ జట్టు బౌలింగ్ అటాక్ భయంకరంగా ఉండేది. మిచెల్ జాన్సన్, నాథన్ బ్రాకెన్, బ్రెట్‌లీ వంటి పేసర్లతో పాటు మైకెల్ క్లార్క్ స్లో, ఆండ్రూ సైమండ్స్ బౌలర్లు ఉన్నారు. అయితే బ్రెట్‌లీని తప్ప మిగతా బౌలర్లను లక్ష్యంగా చేసుకొని భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా యువరాజ్ సింగ్ ( 30 బంతుల్లో 70; 5 సిక్స్‌లు, 5 ఫోర్లు) చెలరేగి ఆడాడు. యువరాజ్‌తో పాటు కెప్టెన్ ధోనీ (36), రాబిన్ ఉతప్ప (34), గౌతమ్ గంభీర్ (24) మంచిగానే రాణించారు. అనంతరం భారత్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించలేక 173/7 స్కోరుకు పరిమితమైంది. 15 పరుగుల తేడాతో ఓడింది.
హలో క్రికెట్ లవర్స్ - ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా? - Cricket Interesting Facts