Olympic Medal Winners Prize Money : ఒలింపిక్‌లో పతకం సాధించేందుకు ప్రతీ అథ్లెట్ ఏళ్ల తరబడి కఠోర శ్రమ చేస్తాడు. ఆ ఒక్క పతకంతో చాలామంది అథ్లెట్లు దిగ్గజాలుగా మారిపోతారు. అయితే ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి ఎంత నగదు ఇస్తారన్న విషయం చాలామందిలో ఆసక్తి రేపుతోంది.
ఈ విశ్వ క్రీడల్లో పతక మోత మోగించిన వారికి ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ ఒక్క డాలర్ కూడా ఇవ్వదు. కానీ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆయ దేశాలు, క్రీడా సంఘాలు మాత్రం నగదు పురస్కారాలు అందజేస్తుంటాయి. కొన్ని దేశాల్లో నగదుతో పాటు, విలాసవంతమైన కార్లు, అపార్ట్‌మెంట్లను కూడా ఇచ్చారు. ఇంతకీ పతకాలు సాధించిన వారికి ఏ దేశం ఎంత నగదు ప్రోత్సాహకం ఇస్తోందో తెలుసుకుందామా?
మలేషియా
ఒలింపిక్ పతకం సాధించిన వారికి విలాసవంతమైన కారు బహుమతిగా ఇస్తామని మలేషియా క్రీడా మంత్రిత్వశాఖ తెలిపింది. రోడ్ టు గోల్డ్ కమిటీ ఈ కారును అథ్లెట్లకు అందజేయనుంది.
రిపబ్లిక్ ఆఫ్ కజఖ్‌స్థాన్
ఒలింపిక్స్‌లో పతక మోత మోగించిన తమ అథ్లెట్లకు విలాసవంతమైన త్రి బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్లను బహుమతిగా ఇస్తామని కజఖ్‌స్థాన్ తెలిపింది. రజత పతకానికి డబల్ బెడ్‌రూమ్, కాంస్యానికి సింగిల్ బెడ్‌రూమ్ బహుమతిగా అందిస్తారు.
సింగపూర్
సింగపూర్ కూడా ఒలింపిక్ పతక విజేతలకు బహుమానం ఇవ్వడానికి ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఒలింపిక్ బంగారు పతక విజేతలకు ఏడు లక్ష 44 వేల డాలర్లు, అలాగే రజత పతక విజేతలకు 3,72,000 డాలర్లు, కాంస్య పతక విజేతలకు 1, 86,000 వేల డాలర్లు అందిస్తారు.
సౌదీ అరేబియా
సౌదీ అరేబియా మాత్రం పతకం గెలిచిన వారిపై కనక వర్షం కురిపిస్తోంది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో రజతంతో సరిపెట్టుకున్న కరాటే అథ్లెట్ తారెగ్ హమేదీకి సౌదీ సుమారు 1.33 మిలియన్ డాలర్లను ప్రధానం చేసింది.
తైవాన్
ఒలింపిక్ బంగారు పతక విజేతలకు తైవాన్ ప్రభుత్వం 6 లక్షల డాలర్లను ఇస్తుంది. ఆ తర్వాత నెల నెల 4 వేల డాలర్ల స్టైఫెండ్ ఇస్తారు.
ఇండియా
భారత ప్రభుత్వం ఒలింపిక్ బంగారు పతక విజేతలకు రూ. 75 లక్షల ప్రైజ్‌మనీ అందిస్తుంది. రజత పతక విజేతలకు రూ. 50 లక్షలు, అలాగే కాంస్య పతక విజేతలకు రూ. 10 లక్షలు ఇస్తుంది. భారత ఒలింపిక్ సంఘం బంగారు పతక విజేతలకు 1,20,000 డాలర్లు ఇస్తుంది.
ఆస్ట్రియా
ఆస్ట్రియా దేశం ఒక్కో ఒలింపిక్ బంగారు పతక విజేతలకు 18,000 డాలర్లను బహుమతి రూపంలో అందిస్తుంది.
రష్యా
సాధారణంగా రష్యా ప్రభుత్వం తమ ఒలింపిక్ విజేతలకు 45,300 డాలర్లను అందిస్తోంది. దీంతో పాటు ఖరీదైన విదేశీ కార్లు, అపార్ట్‌మెంట్‌లు అలాగే బిరుదులు కూడా ఇస్తారు. జీవితకాలం స్టైపెండ్‌లను సైతం అందిస్తారు.
ఈ దేశాల్లో నో ఫ్రైజ్ మనీ
మొరాకో, ఇటలీ, ఫిలిప్పీన్స్, హంగేరీ, కొసావో, ఎస్టోనియా,ఈజిప్ట్, నార్వే, స్వీడన్, బ్రిటన్ ప్రభుత్వాలు ఒలింపిక్ పతక విజేతలకు ఎటువంటి నగదు బహుమతిని అందించవు.