Cricketer Nitish Kumar Reddy Latest Interview : టీమ్ఇండియాకు ఆడాలన్న తన కల నెరవేరిందంటూ యంగ్ ప్లేయర్ నితీశ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది అద్భుతమైన ఆటతో అలరించిన నితీశ్, రానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. 2024 ఐపీఎల్ సీజన్‌లో 303 పరుగులు, 3 వికెట్లతో రాణించిన నితీశ్ అక్కడనుంచి వెనక్కి తగ్గలేదు. బంగ్లాదేశ్‌తో రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడు, ఆ మ్యాచ్‌లో 74 పరుగులు అలాగే 2 వికెట్లతో సత్తాచాటాడు. ఈ నెల 31న ఆసీస్-ఎతో ప్రారంభమయ్యే సిరీస్‌లో భారత్-ఎ తరఫున బరిలో దిగుతున్న నితీశ్ తన కెరీర్ గురించి చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలుఅతడి మాటల్లోనే.
ఆస్ట్రేలియాపై భారత్ తరఫున ఆడటం నాకు చాలా ఆనందంగా ఉంది. గొప్ప ప్లేయర్స్‌తో కలిసి ఆడటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. 2024 నాకు బాగా కలిసొచ్చింది. అంతకుముందు సరైన అవకాశం కోసం చాలా కాలం ఎదురుచూశాను. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా మంచి అవకాశం లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. మేటి ఆల్‌రౌండర్‌గా ఎదగడానికి నేను మరింత కష్టపడాలని అనుకుంటున్నాను. రానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు జరిగే ఎ- సిరీస్ నాకెంతో కీలకం. కంగారూ జట్టుతో పోరుకు ముందు ఆస్ట్రేలియాలో పిచ్‌లు, పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు ఇది మంచి అవకాశం.
టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలనేది దేశంలో ప్రతి క్రికెటర్ కల. అయితే ప్రపంచంలోనే మేటి ఆల్‌రౌండర్ కావాలన్న లక్ష్యంతో నేను ఈ ఫీల్డ్‌లో సాగుతున్నాను. బౌలింగ్ పట్ల ఎక్కువ శ్రద్ధ వహించడానికి అది కూడా ఒక కారణం. బౌలింగ్‌లో ఇంకాస్త మెరుగుపడితే అత్యుత్తమ ఆల్‌రౌండర్ కావొచ్చని అనుకుంటున్నాను.
ఐపీఎల్‌లో ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం వేలం గురించి నేను ప్రస్తుతం ఆలోచించట్లేదు. ప్రస్తుతం నా దృష్టంతా ఎ- సిరీస్‌పైనే ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యంత ముఖ్యమైన ఏకాగ్రత కోల్పోవాలని అనుకోవట్లేదు. బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో కోచ్ గౌతమ్ గంభీర్ నాకు పలు కీలక సూచనలు ఇచ్చాడు. "నీ బ్యాటింగ్‌లో ఏదో పవర్ ఉంది. బాల్‌ను ఈజీగా బౌండరీ దాటించగలవు. బంతి తక్కువ ఎత్తులో వచ్చే ఇటువంటి పిచ్‌పై రివర్స్ స్వీప్ ఆడాల్సిన అవసరం లేదు" అని గంభీర్ ఓ సారి చెప్పాడు. అతడి సూచన మేరకు పవర్‌ను నమ్ముకుని భారీ షాట్లు ఆడాను.
ఇక ఆసీస్‌లో ప్యాట్ కమిన్స్‌తో తలపడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా అతడి ప్లాన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. బ్యాటర్లు తప్పులు చేసేలా చేస్తాడు. ఆఫ్ స్టంప్ ఆవలకు నిలకడగా బంతులు సంధిస్తాడు. అతడి బౌలింగ్‌లో ఓపిక చాలా అవసరం. సన్‌రైజర్స్ తరఫున కమిన్స్ సారథ్యాన్ని నేను బాగా ఆస్వాదించాను. ఆటగాళ్లపై ఒత్తిడి అస్సలు తీసుకురాడు. 100కు ఆలౌట్ అవుతారా లేకుంటే 250 పైచిలుకు పరుగులు చేస్తారా అన్నది చూడకుండానే ఆటగాళ్లకు లైసెన్స్ ఇచ్చేస్తాడు. దూకుడుగా ఆడమని చెప్తుంటాడు. మైదానంలో పూర్తి స్వేచ్ఛనిస్తాడు. ఐపీఎల్‌లో కమిన్స్‌తో కలిసి ఆడాను. ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా ఆడటం ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది.
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ ఊచకోత - టీమ్ ఇండియా భారీ స్కోర్
ఈ 5 యంగ్ ప్లేయర్స్‌కు భలే ఛాన్స్ - టీమ్ ఇండియాలో స్థిరపడతారా?