Neeraj Chopra Doha Diamond League 2024 : భారత జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా త్రుటిలో స్వర్ణాన్ని చేజార్చుకున్నాడు. శుక్రవారం జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో ఈ స్టార్ ప్లేయర్ కేవలం 2 సెంటీమీటర్ల తేడాతో అగ్రస్థానంలో నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో 88.36 మీటర్ల దూరానికి జావెలిన్ విసిరిన నీరజ్ రజతాన్ని సాధించాడు.
ఇక చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జాకబ్ వాద్లెచ్ 88.38 మీటర్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్, ఆ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో వరుసగా 84.93, 86.24, 86.18, 82.228 మీటర్ల దూరాన్ని నమోదు చేశాడు. దీంతో చివరి ప్రయత్నంగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శక్తినంతా కూడదీసుకున్నాడు.
ఈ క్రమంలో బల్లాన్ని విసిరిన నీరజ్, వాద్లెచ్ నమోదు చేసిన రికార్డుకు అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. అలా స్వర్ణానికి దూరమయ్యాడు. ఇదే లీగ్‌లో మరో భారత అథ్లెట్ కిశోర్ జెనా కూడా అత్యుత్తమంగా 76.31 మీటర్ల మేర విసిరి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరో ప్లేయర్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా-86.62 మీ) కాంస్య పతకాన్ని అందుకున్నాడు.