MI vs KKR IPL 2024: 2024 ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి అడుగు వేసింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం ఆటంకం కలిగించడం వల్ల మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. కోల్‌కతా నిర్దేశిచింన 158 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి 8 వికెట్లకు 139 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రసెల్, హర్షిత్ రానా తలో 2, నరైన్ 1 వికెట్ దక్కించుకున్నారు. బంతితో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. కాగా, ఈ సీజన్లో కేకేఆర్‌కు ఇది 9వ విజయం.
6 ఓవర్లకు 63-0
ఛేదనలో ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 పరుగులు, 22) దూకుడుగా ఆడడం వల్ల ముంబయి పవర్‌ప్లేలో 63 పరుగులు సాధించింది. దీంతో ముంబయి సునాయసంగా గెలుస్తుందనిపించింది. కానీ, తర్వాత ఓవర్లో ఇషాన్ ఔటయ్యాడు. దీంతో ముంబయి ఇన్నింగ్స్ గాడి తప్పింది. వరుసగా రోహిత్ శర్మ (19), సూర్యకుమార్ యాదవ్ (11), హార్దిక్ పాండ్య (2), టిమ్ డేవిడ్ (0), నిహాల్ వధేరా (3), నమన్ ధీర్ (17), తిలక్ వర్మ (32) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ముంబయి ఓటమి ఖాయమైంది. కాగా, ఈ సీజన్లో ముంబయికిది 9వ ఓటమి.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవర్లలో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (6 పరుగులు), సునీన్ నరైన్ (0) విఫలమయ్యారు.వెంకటేశ్ అయ్యర్ (42 పరుగులు, 23 బంతుల్లో), నితీశ్ రానా (33 పరుగులు, 23 బంతుల్లో), ఆండ్రీ రస్సెల్ (24 పరుగులు, 14 బంతుల్లో), రింకూ సింగ్ (20 పరుగులు, 12 బంతుల్లో), రమన్‌దీప్ సింగ్ (17*) రాణించారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, పీయుశ్ చావ్లా చెరో 2, నువాన్ తుషారా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ వికెట్ దక్కించుకున్నారు.