MI vs DC WPL 2024: 2024 డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ విజయ పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. టోర్నీలో భాగంగా మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబయి ఓవర్లన్నీ ఆడి వికెట్ల 8 నష్టానికి పరుగులే 163 చేసింది. అమన్‌జోత్ కౌర్ (42 పరుగులు) టాప్ స్కోరర్. దిల్లీ బౌలర్లలో జెస్ జొనసెన్ 3, మారిజాన్ కాప్ 2, టిటాస్ సాధు, రాధా యాదవ్, శిఖ పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.
భారీ లక్ష్య ఛేదనలో ముంబయికి తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ యస్తికా భాటియా (6 పరుగులు) క్లీన్ బౌల్డైంది. ఆ తర్వాత ఓవర్లో వన్ డౌన్ బ్యాటర్ నాట్ సీవర్ (5 పరుగులు)ను శిఖా పాండే పెవిలియన్ చేర్చి ముంబయికి భారీ షాక్ ఇచ్చింది. ఇక వరుసగా హర్మన్‌ప్రీత్ కౌర్ (6 పరుగులు), హేలీ మాథ్యూస్ (29 పరుగులు), అమెలియా కేర్ (17 పరుగులు), పూజ వస్త్రకార్ (17 పరుగులు) ఔటయ్యారు. చివర్లో ఎస్ సంజనా (24 పరుగులు) జోరు ప్రదర్శించినా, అది ముంబయి విజయానికి సరిపోలేదు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ లానింగ్ (53 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (28 పరుగులు) వేగంగా ఆడే క్రమంలో ఓటైంది. ఇక మిడిలార్డర్లో వచ్చిన స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ (63 పరుగులు: 33 బంతుల్లో; 8x4, 3x6) రప్ఫాడించింది. ఏకంగా 209.09 స్ట్రైక్ రేట్ నమోదు చేస్తూ, మెరుపు బ్యాటింగ్‌తో రోడ్రిగ్స్ అదరగొట్టింది. దీంతో దిల్లీకి భారీ స్కోర్ దక్కింది. ముంబయి బౌలర్లలో శబ్నిమ్ ఇస్మైల్, సైకా ఇషాక్, పూజ వస్త్రకార్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు.