Mayank yadav Kl Rahul : ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమికి గురైంది. కేఎల్ రాహుల్ సారథ్యంలో హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్ వేశాడు దిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అద్భుతమైన బౌలింగ్‌తో 3/20 లాంటి స్కోరు నమోదు చేసి లఖ్‌నవూ జట్టును 7 వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమతమయ్యేలా చేశాడు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో 11బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది దిల్లీ జట్టు.
ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ జట్టుకు ప్రధాన బలమైన పేసర్ మయాంక్ యాదవ్ లేని లోటు కనిపించింది. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగల మయాంక్ జట్టు గెలుపోటములలో కీలకం. సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఆడిన అరంగ్రేట
మ్యాచ్ నుంచే తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలో ఏడు వికెట్లు పడగొట్టాడు. గత వారం గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గాయం కావడంతో అర్ధాంతరంగా స్టేడియంను వదిలి వెళ్లిపోయాడు.
ఫలితంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్రత్యర్థి జట్టును ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బందిపడింది. జేక్ ఫ్రేసర్ మెక్ గర్క్ (55*), రిషబ్ పంత్ (41) చేసిన పరుగులకు బ్రేక్ వేయలేకపోయింది కేఎల్ రాహుల్ జట్టు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్ జట్టులో కీలక ప్లేయర్ అయిన మయాంక్ లీగ్‌కు ఎప్పుడు తిరిగొస్తాడనే దానిపై స్పందించాడు.
"మయాంక్ యాదవ్ ఇప్పుడు బాగానే ఉన్నాడు. కానీ, అతనిపై ఒత్తిడి తీసుకురావాలని మేం అనుకోవడం లేదు. ఆడేందుకు సుముఖత చూపిస్తూ మ్యాచ్‌కు వస్తానంటున్నా మేమే తనకు రెస్ట్ కావాలని సూచించాం. వంద శాతం పర్‌ఫెక్ట్ అనుకున్నప్పుడే తిరిగొస్తాడు. మరో రెండు మ్యాచ్‌ల తర్వాత వస్తాడని ఆశిస్తున్నాం" అని చెప్పిన రాహుల్ మిగిలినది టీమ్ మేనేజ్మెంట్ చూసుకుంటుందని తెలిపాడు.
అంతకంటే ముందు మాట్లాడిన జస్టిన్ లాంగర్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఏప్రిల్ 19న జరిగే మ్యాచ్ ముందు వరకూ మయాంక్ అందుబాటులోకి రాడని చెప్పాడు. "మయాంక్ రికవరీ అయ్యేందుకు సమయం పడుతుంది.ఇంకో రెండు గేమ్ లు కూడా ఆడలేడనుకుంటున్నా. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించి చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ నాటికి సిద్ధం అవుతాడని అనుకుంటున్నా" అని తెలిపాడు.
అంపైర్‌తో పంత్ గొడవ - మండిపడ్డ మాజీ క్రికెటర్ - IPL 2024 LSG VS DC
ఒకే ఫ్రేమ్‌లో సచిన్ ధోనీ రోహిత్ - ఫ్యాన్స్‌లో డబుల్ జోష్! - IPL 2024