Manu bhaker Neeraj chopra Marriage : పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా, మను బాకర్ అద్భుత ప్రదర్శన చేశారు. మను బాకర్ రెండు కాంస్య పతకాలు గెలుచుకోగా నీరజ్ ఓ రజతాన్ని అందుకున్నాడు. అయితే ఒలింపిక్స్ ముగిశాక వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో బయట తెగ చక్కర్లు కొట్టింది. దాంతో వీరిద్దరి ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంతా ప్రచారం సాగింది.
తాజాగా దీనిపై షూటర్ మను బాకర్ తండ్రి రామ్ కిషన్ బాకర్ స్పందించారు. మను ఇంకా చిన్నపిల్లే అని ఆ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టేశారు. "మను ఇంకా చిన్న పిల్లే. ఆమెకు పెళ్లి వయసు ఇంకా రాలేదు. మేం అసలు ఆ విషయం గురించి అస్సలు ఆలోచించడం కూడా లేదు" అని సమాధానం ఇచ్చారు.
అలానే మను తల్లి నీరజ్ చోప్రాతో మాట్లాడటం, తలపై చోప్రా చేతిని ఉంచి ఒట్టు తీసుకున్నట్లుగా వీడియోలో కనిపించడం కూడా బాగా చర్చనీయాంశమైంది. దీంతో నీరజ్ చోప్రా - మను పెళ్లి అంటూ ఊహా గానాలు మరో స్థాయికి చేరుకున్నాయి. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలి అని నీరజ్‌ను మను అమ్మ కోరినట్లు చాలా మంది నెటిజన్లు మాట్లాడుకున్నారు.
దీని గురించి రామ్ కిషన్ మాట్లాడుతూ నీరజ్‌ను ఆమె ఓ బిడ్డలా భావిస్తోంది అని అన్నారు. అయితే నిజానికి వాళ్ల మధ్య ఏం చర్చ జరిగింది అన్న విషయంపై క్లారిటీ లేదు.
మరోవైపు నీరజ్ బంధువు కూడా దీనిపై స్పందించారు. "నీరజ్ మెడల్ సాధించినప్పుడు దేశం మొత్తం ఎలా చూసిందో అలాగే పెళ్లి విషయం కూడా అందరికీ తెలుస్తుంది" అని క్లారిటీ ఇచ్చారు.
ఇకపోతే టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా ఈ సారి సిల్వర్ మెడల్‌ను దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో ఫైనల్‌లో రెండో ప్రయత్నంలో 89.45 మీటర్లు ఈటెను విసిరి రజతాన్ని పట్టాడు. దీంతో నీరజ్ వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్‌గా నిలిచాడు.
ఇక మను బాకర్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రెండు బ్రాంజ్ మెడల్స్ దక్కించుకుంది. 124 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో మెడల్స్‌ను సొంతం చేసుకుంది.