KL Rahul RCB : టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్లో ఆర్సీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2016 ఫైనల్లో ఎదురైన ఓటమిని ఇప్పటికీ మరిచిపోలేనని అన్నాడు. 2016 నుంచి ఈ ఓటమి గురించి విరాట్ కోహ్లీ, తాను చాలా సార్లు మాట్లాడుకున్నామని తెలిపాడు. తాజాగా అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
అది ఇంకా గుర్తుంది
'2016 ఐపీఎల్లో నేను ఆర్సీబీ తరఫున ఆడిన రోజులు ఇంకా గుర్తున్నాయి. ఆ సీజన్ ఫైనల్లో ఓటమి గురించి విరాట్, నేను చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఆ మ్యాచ్‌లో కోహ్లీ, నేను ఇద్దరిలో ఎవరో ఒకరు మరికొంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే మ్యాచ్ పరిస్థితి వేరేగా ఉండేది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఆర్సీబీ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ చేరుకుంది. హోం గ్రౌండ్ చిన్నస్వామిలో ఫైనల్ ఆడాం. ఆ ఫైనల్ గెలిస్తే అది నాకు అద్భుతమైన ముగింపు అయ్యేది. కానీ, దురదృష్టవశాత్తు అలా జరగలేదు'
నేను ఎవ్వరినీ అడగను
అలాగే కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడాడు. తనంతట తానుగా వెళ్లి ఎవరినీ కెప్టెన్సీ ఇవ్వమని అడగనని రాహుల్ తెలిపాడు. 'నాకు కెప్టెన్సీ ఇవ్వమని ఎవరి దగ్గరకూ వెళ్లి అడగను. జట్టును నడిపే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు నాకు ఉన్నాయని వారు భావిస్తే, సంతోషిస్తా అంతే' అని చెప్పాడు.
KL Rahul talking about the 2016 IPL Final. 🥹💔pic.twitter.com/Z8EaEJZcPU
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 13, 2024
అదే కోరుకుంటారు
ఐపీఎల్ అంటే గ్లామర్ షో అని అందరూ అనుకుంటారు. కానీ, అలా కాదని కేఎల్ తెలిపాడు. ప్రతి క్రీడాకారుడు ఐపీఎల్ లేదా ఏదైనా టోర్నీలో కచ్చితంగా గెలవాలని కోరుకుంటాడని వెల్లడించాడు. కప్పు గెలవాలనే కసి లేకపోతే క్రీడాకారుడు ఉన్నత స్థాయికి చేరుకోలేడని అన్నాడు.
Rahul IPL Career : కేఎల్ రాహుల్ ఐపీఎల్లో ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. 132 మ్యాచుల్లో 4,683 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, గత సీజన్ వరకు లఖ్‌నవూ తరఫున ఆడిన కేఎల్ రాహుల్‌ను ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో రాహుల్ మెగావేలంలో ఉండనున్నాడు.
నాకు కొంచం ఫ్రీడమ్ కావాలి! అందుకే లఖ్‌నవూ నుంచి బయటకు వచ్చాను : కేఎల్ రాహుల్