KKR vs LSG IPL 2024 : 2024 ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. అంతేకాదు ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకుంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ఆధిపత్యంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ను ఏకంగా 98 పరుగుల తేడాతో ఓడించింది కోల్‌కతా నైట్‌రైడర్స్. నరైన్ మరోసారి బ్యాట్‌తో రెచ్చిపోవడంతో కొండంత లక్ష్యాన్ని నిర్దేశించిన కోల్‌కతా ఆ తర్వాత వరుణ్, రసెల్, నరైన్‌ల అదిరే బౌలింగ్ చేయడంతో లఖ్‌నవూను కట్టడిచేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ప్రత్యర్థి జట్టు లఖ్‌నవూ ముందు 236 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. కేకేఆర్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (32 పరుగులు), సునీల్ నరైన్ (81 పరుగులు, 39 బంతుల్లో) అదరగొట్టారు. వన్‌డౌన్‌లో వచ్చిన రఘువంశీ (32 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. ఇక అండ్రీ రస్సెల్ (12), రింకూ సింగ్ (16), శ్రేయస్ అయ్యర్ (23) ఆకట్టుకోలేదు. వీళ్లలో ఒకరైనా క్రీజులో కుదురుకుంటే స్కోర్ 250 దాటేదే. ఇక చివర్లో రమన్‌దీప్ సింగ్ (*25 పరుగులు) రాణించండం వల్ల 235 స్కోర్ దక్కింది. లఖ్‌నవూ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుద్వీర్ సింగ్ చరక్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇక భారీ లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ తడబడింది. మొదట ధీటుగా ఆరంభించినా తర్వాత వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రాణా (3/24), వరుణ్ చక్రవర్తి (3/30), రసెల్ (2/17) దెబ్బకు 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. లఖ్‌నవూ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (25 పరుగులు), అర్షిన్ కులకర్ణి (9 పరుగులు) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన మార్కస్ స్టాయిన్ (36 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. అతడే టాప్ స్కోరర్. ఇక యంగ్ బ్యాటర్ దీపక్ హూడా (5)మరోసారి విఫలమయ్యాడు. మొత్తంగా లఖ్‌నవూకు 11 మ్యాచ్‌ల్లో ఇది ఐదో ఓటమి. భారీ తేడాతో ఓడడం లఖ్‌నవూ నెట్‌రన్‌రేట్‌ను బాగా దెబ్బ తీసింది.
నరైన్ అరుదైన రికార్డ్ : కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అటు బ్యాటింగ్‌లో 1500+ పరుగులు, ఇటు బౌలింగ్‌లో 150+ వికెట్లు తీసిన మూడో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. నరైన్ ప్రస్తుతం ఐపీఎల్ కెరీర్లో 1507 పరుగులు, 176 వికెట్లు ఉన్నాయి. నరైన్ కంటే ముందు రవీంద్ర జడేజా (2894 పరుగులు, 160 వికెట్లు, డ్వేన్ బ్రావో (1560 పరుగులు, 183 వికెట్లు) ఈ ఘనత సాధించారు.
లఖ్‌నవూపై 'నరైన్' విధ్వంసం- ఖాతాలో మరో రికార్డ్ - IPL 2024
ముంబయిపై కోల్‌కతా విజయం - 12ఏళ్ల తర్వాత తొలిసారి! - IPL 2024