Keshav Maharaj Ayodhya: సౌతాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్ అయోధ్య రామమందిరాన్ని సందర్శించాలనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న కేశవ్, రీసెంట్గా జరిగిన అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాలేకపోయాడు. అయితే డర్బన్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యాజమాన్యానిదే. దీంతో తన కుటుంబ సభ్యులతో సహా అయోధ్య టూర్‌కు ఎల్ఎస్జీ (LSG) ఫ్రాంచైజీ సహాయం చేస్తుందని ఆశించాడు.
'నా బిజీ షెడ్యూల్ కారణంగా రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయాను. కానీ, భవిష్యత్‌లో కచ్చితంగా అయోధ్య రామమందిరాన్ని సందర్శిస్తా. మా ఫ్యామిలీ కూడా భారత్‌లో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలని ఎప్పట్నుంచో అనుకుంటుంది. ఈ విషయంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్రాంఛైజీ నాకు హెల్ప్ చేస్తుందనుకుంటున్నా' అని కేశవ్ అన్నాడు.
Keshav Maharaj Ayodhya Wishes: రీసెంట్గా రామమందిక ప్రారంభోత్సవానికి ముందు కేశవ్ సౌతాఫ్రికాలో ఉన్న భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాడు.'అందరికీ నమస్తే, అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సం సందర్భంగా సౌతాఫ్రికాలో ఉన్న నా భారతీయులందరికీ శుభాకాంక్షలు. అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలగాలి. జై శ్రీరామ్' అని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే కేశవ్ మహరాజ్ భారతీయ మూలాలున్న సౌతాఫ్రికా పౌరుడు. అతడి పూర్వికులు (తాత) ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్‌కు చెందినవారు. కేశవ్ భార్య లెరిషా మున్సామీ ఓ కథకళి డ్యాన్సర్. ఇక రామమందిరాన్ని సందర్శించడానికి తను కూడా ఎదురుచూస్తున్నట్లు కేశవ్ తెలిపాడు. ఈసారి భారత్‌కు వచ్చినప్పుడు కచ్చితంగా అయోధ్య మందిరాన్ని సందర్శిస్తానని కేశవ్ ఓ సందర్భంలో చెప్పాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు భారత్ వచ్చిన కేశవ్, కేరళలోని పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లాడు.
గతంలో సౌతాఫ్రికా ఆడిన మ్యాచ్‌ల్లో కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో పలుమార్లు రాముడి పాటలు ప్లే చేశారు. రీసెంట్గా సౌతాఫ్రికా- భారత్ టెస్టు, వన్డే సిరీస్‌లోనూ ఆదిపురుష్ సినిమాలోని 'సీతా రామ్' పాట ప్లే చేశారు. 'నువ్వు వచ్చినప్పుడు రాముడి పాట ప్లే చేస్తున్నారు' అని టీమ్ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, కేశవ్‌తో చెప్పాడు. దీంతో కేశవ్ కూడా నవ్వుతూ అవునని బదులిచ్చాడు.
రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ- సౌతాఫ్రికా క్రికెటర్ స్పెషల్ విషెస్