Kapil Dev About Vinod Kambli : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, కాంబ్లీకి సపోర్ట్ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. అయితే స్వయం సహాయమే మొదటి అడుగు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
"మేమంతా కాంబ్లీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టు తరఫున సాయం చేయాలని సునీల్ గావస్కర్ ఇప్పటికే నాకు చెప్పారు. నా తరఫున నేను నా సహాయాన్ని అందిస్తాను. కానీ అతనికి సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. అయితే నా కంటే ముందు అతడు అతడికే సపోర్ట్ చేసుకోవడం ముఖ్యం. అతడు తన కోసం జాగ్రత్తలు తీసుకోలేనప్పుడు, మేము కూడా తీసుకోలేం." అని కపిల్ అన్నారు. కాంబ్లీ ఆరోగ్యం క్షీణించడంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య కపిల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాంబ్లీ ఇప్పుడు శారీరకంగా, మానసికంగా బలహీనమైన స్థితిలో ఉన్నాడు.
ఇటీవల కాంబ్లీ, సచిన్ తెందూల్కర్ ఇద్దరికీ మెంటర్ అయిన కోచ్ రమాకాంత్ అచ్రేకర్ సేవలను గౌరవించేందుకు ఇటీవల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన కాంబ్లీ దీనస్థితిలో కనిపించారు. ఈ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చాలా మంది కాంబ్లీకి తోటి క్రికెటర్లు, బీసీసీఐ సాయం చేయాలని కోరారు.
తెందూల్కర్‌తో కాంబ్లీ దోస్తీ
కాంబ్లీ, తెందూల్కర్ ముంబయిలోని శారదాశ్రమ్ విద్యామందిర్ పాఠశాలలో చదువుకున్నారు. రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ పొందారు. వీరిద్దరూ 1988లో హారిస్ షీల్డ్ సెమీఫైనల్‌లో 664 పరుగులతో భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. చాలా కాలం పాటు ఇద్దరి స్నేహం కొనసాగింది. కాంబ్లీ కష్ట సమయాల్లో సచిన్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. 1990లలో కాంబ్లీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో గుర్తింపు పొందాడు. 1991, 2000 మధ్య భారతదేశం తరఫున 17 టెస్ట్ మ్యాచ్‌లు, 104 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. మొత్తంగా 3,561 పరుగులు చేశాడు.