Kamran Akmal Praises BCCI : ప్రపంచ క్రికెట్లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. గత కొంతకాలంగా ఆ జట్టు వరుసగా పరాజయాలు చవిచూస్తూ, ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పలుమార్లు కెప్టెన్‌తోపాటు ఏకంగా జాతీయ క్రికెట్ బోర్డులో పెను మార్పులు చేసినా, ఆటగాళ్లకు కఠినమైన ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చినా పాక్ పరిస్థితి మెరుగు పడలేదు.
అయితే ఈ వైఫల్యానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కారణమని ఆ జట్టు మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు. బోర్డులో కొందరి అహం (Ego) వల్ల పాక్ క్రికెట్‌కు ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. జాతీయ క్రికెట్ బోర్డును ఎలా నడిపించాలో బీసీసీఐని చూసి పీసీబీ (Pakistan Cricket Board) నేర్చుకోవాలని తెలిపాడు. బీసీసీఐ క్రమశిక్షణతో బోర్డును నడుపుతూ జట్టును పటిష్ఠంగా తయారు చేసుకుంటుందని రీసెంట్గా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడాడు.
'బీసీసీఐని చూసి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చాలా నేర్చుకోవాలి. జట్టు ఎంపిక విధానం, కెప్టెన్, కోచ్ విషయంలో బీసీసీఐ ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఇవి బీసీసీసీఐ నుంచి పీసీబీ నేర్చుకోవాలి. ఈ అంశాలే ప్రపంచ క్రికెట్లో జట్టును నెం. 1 గా నిలబెడతాయి. మననంతా (పీసీబీ) బాగుంటే పాకిస్థాన్ క్రికెట్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కొందరి అహంకారం వల్ల పాక్ క్రికెట్ దెబ్బ తింటోంది' అని కమ్రాన్ అక్మల్ అన్నాడు.
ఈ ఏడాదిలో పాకిస్థాన్ ఘోర ఓటములు
- ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమి
- న్యూజింలాండ్తో 4-1 తేడాతో టీ20 సిరీస్ ఓటమి
- స్వదేశంలో కివీస్‌లో 2-2 తో టీ20 సిరీస్ డ్రా
- ఇంగ్లాండ్‌తో 2-0తో టీ20 సిరీస్ ఓటమి
- టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమణ
- రీసెంట్గా స్వదేశంలో బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్టు సిరీస్ ఓటమి
Pakistan Upcoming matches
- స్వదేశంలో ఇంగ్లాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్
- ఆస్ట్రేలియా పర్యటనలో 3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్
- జింబాబ్వే పర్యటనలో 3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్
- సౌతాఫ్రికా పర్యటనలో 3 మ్యాచ్‌ల వన్డే, టీ20, 2 టెస్టు సిరీస్
పాకిస్థాన్ పర్యటనపై బీసీసీఐ ఆలోచన ఇదే - అదనపు నిధులు కేటాయించిన ఐసీసీ! - Champions Trophy 2025