Junior PV Sindhu Badminton Player Tanvi Patri : కోర్టులో వేగంగా కదిలే నైపుణ్యం, స్మాష్‌లతో సత్తాచాటే లక్షణం, అలవోకగా పాయింట్లు సాధించే ప్రతిభ, చిన్న వయసులోనే పెద్ద విజయాలు. మరో పీవీ సింధులా ఎదుగుతుందనే అభిప్రాయాలు. ఇదంతా 13 ఏళ్ల తన్వి పత్రి గురించే. తాజాగా ఆసియా అండర్-15 ఛాంపియన్‌గా నిలిచిన ఈ ఒడిశా అమ్మాయి, భారత బ్యాడ్మింటన్ భవిష్యత్ తారగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో తన్వి పత్రిని ఈటీవీ భారత్ పలకరించింది. ఈ క్రమంలో తన్వి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అవేంటంటే?
తండ్రిని చూసే ఆటపై ఆసక్తి - తన్వి తల్లిదండ్రులు రవి నారాయణన్, శైలాబాల చైనాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. తండ్రి రవి నారాయణన్ బ్యాడ్మింటన్ ఆడుతుండగా తన్వి చూసి ఆట పట్ల ఆకర్షితురాలైంది. 5 ఏళ్ల నుంచే చైనాలోని జియాంగ్ యాంగ్ శిక్షణలో తన్వి బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో 2017 నుంచి 2020 వరకు అక్కడ 9 టైటిళ్లు గెలిచుకుంది. అయితే, కొవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా తన్వి కుటుంబం భారత్‌కు తిరిగొచ్చేసింది. 2022లో బెంగళూరులోని ప్రకాశ్ పదుకొణె బ్యాడ్మింటన్ అకాడమీ (పీపీబీఏ)లో తన్వి చేరింది. అక్కడి నుంచి క్రమంగా మరింత మెరుగవుతూ వచ్చింది. 13 ఏళ్లకే అందరితో జూనియర్ పీవీ సింధు అని తన్వి ప్రశంసలు అందుకుంది.
'ఒలింపిక్స్‌లో దేశానికి రెండు పతకాలు అందిస్తా'
"నా తండ్రి స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించి చైనాలో 9 పతకాలు సాధించాను. ఒక్క టోర్నీలో మాత్రమే సెమీ ఫైనల్లో ఓడిపోయాను. ఆ ఓటమిని ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ ఆ తర్వాత మరింత కష్టపడి టోర్నీలు ఆడాను. ఇటీవల జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో అండర్-15 టైటిల్ గెలిచుకున్నాను. భవిష్యత్తులో భారత్‌కు ఒలింపిక్స్‌లో రెండు బంగారు పతకాలు అందించాలన్నదే నా కల. " అని ఈటీవీ భారత్‌తో ఇంటర్వ్యూలో తన్వి చెప్పుకొచ్చింది.
తన్వి సాధించిన పతకాలు ఇవే! - ఇప్పటి వరకు రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లో జరిగిన పలు పోటీల్లో తన్వి పతకాలు సాధించింది. ఇటీవలే ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన అఖిల భారత సబ్ జూనియర్ ర్యాంకింగ్ టోర్నీల్లో తన్వి అండర్-15, 17 విజేతగా నిలిచింది. ఓఎస్ బీఏ ఆల్ ఒడిశా మినీలో జూనియర్ ర్యాకింగ్‌లో మూడు టైటిళ్లు, అండర్- 19 బాలికల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే హైదరాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లోనూ అండర్ -15, అండర్ -17 బాలికల సింగిల్స్ టైటిళ్లను గెలుచుకుంది. పుణె డిస్ట్రిక్ట్ మెట్రోపాలిటన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన పోటీలో తన్వి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
అండర్-19 జట్టులోకి ద్రవిడ్ కుమారుడు - ఆస్ట్రేలియాతో సిరీస్ - Rahul Dravid Son U19 team