Jasprit Bumrah T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన మాయాజాలంతో జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ పలు కీలక వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీంతో అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు ముప్పు తిప్పలు పడుతున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో చెలరేగి భారత్‌కు విజయాన్ని అందించిన బుమ్రా, సూపర్8లో భాగంగా ఇటీవలె అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మూడు వికెట్లను పడగొట్టి మెరిశాడు. ఈ నేపథ్యంలో బుమ్రా బౌలింగ్‌పై టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ అక్షర్ పటేల్ తాజాగా మీడియాతో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో అతడి బౌలింగ్ గురించి ఎవ్వరూ డిస్కస్ చేయరని తెలిపాడు.
" బుమ్రా బౌలింగ్ గురించి టీమ్‌లో ఎవరూ అంతగా చర్చించరు. ఎప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తనకు చాలా బాగా తెలుసు. బౌలింగ్ కోచ్ కూడా ఎక్కువ ఇన్‌పుట్‌లు ఇచ్చి అతడ్ని అనవసరమైన గందరగోళానికి గురిచేయడు. బాగా ఆడుతున్నావు అని మాత్రమే అంటాడు. ప్లానింగ్ సమయంలోనూ కూడా నీ వ్యూహాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. అనుకున్నట్లు బౌలింగ్ చేయమని సూచిస్తుంటాడు." అని అక్షర్ పేర్కొన్నాడు.
బుమ్రా టీమ్‌కు ప్లస్ పాయింట్
బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి బౌలర్ జట్టు ఉండటం ఎల్లప్పుడూ అదనపు ప్రయోజనం అందిస్తుందని అక్షర్ తెలిపాడు. బుమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్ చాలా బలంగా ఉందని, కఠినమైన పరిస్థితుల నుంచి కూడా మేము బయటపడగలమన్న నమ్మకం మాకు ఉందని అన్నాడు. అవతలి ఎండ్‌లో బుమ్రా లాంటి బౌలర్ పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తే ఇవతలి ఎండ్‌లో తమ పని సులువు అవుతుందని అక్షర్ తెలిపాడు.
పరిస్థితులకు తగ్గట్లుగా
బార్బడోస్‌లో అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ నెమ్మదిగా ఉందని బుమ్రా వెంటనే గ్రహించాడు. అందుకే పవర్‌ప్లేలో స్లో డెలివరిలతో అఫ్గాన్ బ్యాటర్లను కట్టడి చేశాడు. తర్వాత ఫుల్ లెంగ్త్ యార్కర్‌తో జద్రాన్ ఔట్ చేశాడు. బుమ్రా నేతృత్వంలోని భారత బౌలర్లు రాణించడం వల్ల అఫ్గాన్ 20 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో విజయం భారత్‌కు సొంతమైంది.
నాలుగు ఓవర్లలో 7 పరుగులు - ఇంటర్నేషనల్ మ్యాచుల్లో బుమ్రా నయా రికార్డు - T20 World Cup 2024