Jasprit Bumrah Border Gavaskar Trophy : టీమ్ఇండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అదరగొట్టాడు. 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో సంచలన రికార్డును నమోదు చేశాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై అత్యధిక సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా కపిల్ దేవ్ సరసన బుమ్రా నిలిచాడు. సేనా దేశాలపై కపిల్, బుమ్రా ఏకంగా ఏడు సార్లు అయిదు వికెట్లు సాధించాడు.
కపిల్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే
అయితే మ్యాచ్లుపరంగా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించింది బుమ్రానే. ఇక ఈ స్టార్ పేసర్ 51 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా, కపిల్ దేవ్ 62 మ్యాచ్‌ల్లో ఏడు సార్లు అయిదు వికెట్లు పడగొట్టాడు. నాటింగ్ హమ్, కేప్ టౌన్ వేదికల్లో రెండు సార్లు, జొహెన్నెస్ బర్గ్, మెల్ బోర్న్, పెర్త్‌లో ఒకసారి బుమ్రా అయిదు వికెట్లు ఘనత సాధించాడు. టెస్టు కెరీర్లో బుమ్రా ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు 11వ సారి పడగొట్టాడు.
దక్షిణాఫ్రికాలో మూడు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, భారత్ లో రెండు సార్లు ఈ ఘనత సాధించాడు. బీఎస్ చంద్రశేఖర్ (6), జహీర్ ఖాన్ (6), బిషన్ సింగ్ బేడీ (5), అనిల్ కుంబ్లే (5) సేనా దేశాలపై 5 వికెట్లు తీశారు. వీరిని అధిగమించి బుమ్రా కపిల్ సరసన చేరాడు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. 8 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీశాడు. కపిల్ దేవ్ 11 టెస్టుల్లో 51 వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే (49), రవిచంద్రన్ అశ్విన్ (39) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐదో కెప్టెన్‌గా రికార్డు
అలాగే వినూ మన్కడ్ (1), బిషన్ బేడీ (8), కపిల్ దేవ్ (4), అనిల్ కుంబ్లే (2) తర్వాత టెస్టుల్లో ఐదు వికెట్లు తీసిన ఐదో భారత కెప్టెన్‌గా బుమ్రా నిలిచాడు. 2007లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో కుంబ్లే (5/84) ఈ ఘనత సాధించిన చివరి భారత కెప్టెన్. మళ్లీ ఆ పాంచ్ పటాకాను కెప్టెన్‌గా బుమ్రా అందుకున్నాడు.
బుమ్రాపై గిల్ క్రిస్ట్ ప్రశంసలు
టీమ్ఇండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాపై ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. పెర్త్ టెస్టులో లబుషేన్ క్యాచ్‌ను విరాట్ కోహ్లీ వదిలేసినా బుమ్రా ప్రవర్తించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపాడు. విరాట్ కోహ్లీ క్యాచ్ వదిలేసినా బుమ్రా చిరునవ్వుతోనే బౌలింగ్ చేశాడని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో ఐదు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతిఒక్కరూ అతడిలా సానుకూల దృక్పథంతో ఉంటే బాగుంటుందని అన్నాడు.
"బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఎంతటి బ్యాటరైనా భయపడాల్సిందే. ఏ క్షణంలోనూ పట్టు వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా అతడి ప్రదర్శన ఆ స్థాయిలో ఉంది. వికెట్ కొద్దిలో చేజారినప్పటికీ అతడి బౌలింగ్ యాక్షన్, స్టైల్, టెక్నిక్స్‌లో ఎలాంటి ఛేంజ్ లేదు. ఆ విషయంలో బుమ్రా బాగా నచ్చాడు. విరాట్ క్యాచ్ వదిలేసినప్పుడు బుమ్రా రియాక్షన్ అద్భుతం. చిరునవ్వుతోనే ముందుకు సాగిపోయాడు." అని ఆడమ్ గిల్ క్రిస్ట్ వ్యాఖ్యానించాడు.
బుమ్రా అరుదైన రికార్డ్- స్టెయిన్ తర్వాత ఆ ఘనత మనోడిదే!
'ఎవరిని మీడియం పేసర్ అంటున్నావ్?- నేను 150 స్పీడ్‌తో బౌలింగ్ చేస్తా'