Gianmarco Tamberi Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఓ అనుహ్య ఘటన జరిగింది. ఈ క్రీడల్లో ఇటలీకి ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ హై జంపర్ జియాన్మార్కో టాంబేరి తాజాగా తన వెడ్డింగ్ రింగ్‌ను పోగుట్టుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించాడు. అంతే కాకుండా ఇలా జరిగినందుకు తన భార్యకు సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పాడు.
"ఐ యామ్ సారీ మై లవ్. ఆ నదిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. గత కొద్ది నెలల్లో బరువు తగ్గడమో లేకుంటే చాలా కాలంగా దాచుంచుకున్న అత్యుత్సాహమో తెలియదు. పై మూడు కారణాల వల్ల నా నుంచి ఆ రింగ్ చేజారిపోయింది. పడవ బౌన్స్ అయ్యేంత వరకూ నేను ఆ రింగ్‌ను పట్టుకునేందుకు ఎంతగానో ట్రై చేశాను. బోట్ లోపలే అది పడుతుందని అనుకున్నాను. కానీ అది గాల్లోకి ఎగురుకుంటూ వెళ్లి నీళ్లలో పడింది. అయితే ఇలా జరగడానికి కూడా ఓ కారణం ఉందని నాకు అనిపిస్తోంది. 'సిటీ ఆఫ్ లవ్'కు వేదికైన నదిలో ఆ రింగ్ నిక్షిప్తం కావడం ఓ అద్భుతం. అది ఉండటానికి అంతకుమించిన గొప్ప ప్రాంతం మరొకటి ఉండదేమో. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా సంగ్రామంలో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించడం నేను మరిచిపోలేని ఓ అనుభూతి. ఆ రింగ్ మిస్ అయినప్పటికీ ఇబ్బంది లేదు. మళ్లీ కొత్తగా ప్రామిస్ చేసుకుందామని అప్పుడప్పుడూ నువ్వు అంటుంటావు కదా. ఇప్పుడు మళ్లీ డిఫరెంట్‌గా పెళ్లి చేసుకుందాం. పారిస్ నుంచి అంతకంటే విలువైన గోల్డ్‌తో నేను ఇంటికి వస్తా" అంటూ తన భార్య కోసం ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.
ఇటీవలే పారిస్‌లోని సెన్ నదిలో ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరిమనీ అట్టహాసంగా జరిగింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ జెండాను పట్టుకుని బోట్లో పరేడ్‌గా వెళ్లారు. అందులో భాగంగా ఇటలీ జాతీయ పతాకాధారిగా టాంబేరి వ్యవహరించాడు. ఈ సందర్భంగా సెన్ నదిపై జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడే తన వెడ్డింగ్ రింగ్‌ను మిస్ చేసుకున్నాడు.