IPL First Title Winners : 2008లో ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ త్వరలో 17వ సీజన్‌తో క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకోనుంది. ఎన్నో అద్భుతమైన విజయాలకు ఐపీఎల్ వేదికగా నిలిచింది. ముంబయి ఇండియన్స్ అత్యధికంగా ఐదు టైటిల్స్ నెగ్గి, చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు మొదటి స్థానంలో ఉంది.
ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు సార్లు కప్పు కొట్టింది. డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ ఒక్కో టైటిల్ గెలిచాయి. వీటన్నింటికంటే 2008 మొట్ట మొదటి ఐపీఎల్ సీజన్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఎప్పటికీ ప్రత్యేకం. ఆస్ట్రేలియా మాజీ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ నాయకత్వంలో, మెన్ ఇన్ పింక్ మొదటి ఛాంపియన్‌గా అవతరించింది.
మొదటి ఫైనల్ మ్యాచ్‌లో చెన్నైపై మూడు వికెట్ల తేడాతో నెగ్గి రాజస్థాన్ రికార్డు క్రియేట్ చేసింది. దురదృష్టవశాత్తు అప్పటి నుంచి రాజస్థాన్ రాయల్స్ మరో కప్పు నెగ్గలేకపోయింది. త్వరలో మరో టైటిల్ వేట కోసం సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ బరిలో దిగుతోంది. మరిప్పుడు మొదటి కప్పు గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లోని సభ్యులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారో? చూద్దామా!
- షేన్ వార్న్
షేన్ వార్న్ మొదటి సీజన్‌లో జట్టును ముందుండి నడిపించాడు. 2011 సీజన్‌లో ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాడు. 2022 మార్చిలో ఆస్ట్రేలియన్ స్పిన్ మాంత్రికుడు మరణించాడు. - గ్రేమ్ స్మిత్
మొదటి ఐపీఎల్‌లో 11 మ్యాచ్‌లలో 49.00 సగటుతో 441 పరుగులు చేశాడు. 2008లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. 2014 మార్చిలో స్మిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. - యూనిస్ ఖాన్
2008 ముంబయి దాడుల తర్వాత పాకిస్థానీ ఆటగాళ్లపై ఐపీఎల్ ఆడకుండా నిషేధించిన సంగతి తెలిసిందే. 2008 తర్వాత యూనిస్ ఖాన్ లీగ్‌కి దూరమయ్యాడు. 2017 మే లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. - కమ్రాన్ అక్మల్
మొదటి ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ కమ్రాన్ అక్మల్‌ను రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. సీజన్‌లో అతను కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2023 ఫిబ్రవరిలో అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. - మహ్మద్ కైఫ్
కైఫ్ 2008 సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లలో 176 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2018 జులైలో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. - మోర్నే మోర్కెల్
దక్షిణాఫ్రికా బౌలింగ్ లెజెండ్ మోర్నే మోర్కెల్.. 2023 జూన్ నుంచి 2023 నవంబర్ వరకు పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. - రవీంద్ర జడేజా
జడేజా తన ఐపీఎల్ కెరీర్‌ని 2008లో రాజస్థాన్ రాయల్స్‌తో ప్రారంభించాడు. తొలి సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 135 పరుగులు చేశాడు. 2012 నుంచి జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. - సిద్ధార్థ్ త్రివేది
ఈ పేస్ బౌలర్ 2013 వరకు రాజస్థాన్ జట్టులో ఆడాడు. 2020లో అధికారికంగా అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అంతకుముందు త్రివేది 2015 మార్చిలో సౌరాష్ట్ర తరఫున చివరి డొమెస్టిక్ మ్యాచ్ ఆడాడు. - స్వప్నిల్ అస్నోద్కర్
2011 తర్వాత ఈ గోవా బ్యాటర్‌కు మళ్లీ ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశం రాలేదు. అస్నోద్కర్ 2019లో తన క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. - మునాఫ్ పటేల్
2018 నవంబర్‌లో మునాఫ్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అంతకు ముందు ఏడేళ్ల పాటు టీమ్ ఇండియాలో స్థానం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. - సోహైల్ తన్వీర్
అందరు పాకిస్థానీ ప్లేయర్‌ల తరహాలోనే తన్వీర్ 2008 తర్వాత ఐపీఎల్‌కి దూరమయ్యాడు. 2023 మార్చిలో ఈ వెటరన్ స్పీడ్‌స్టర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.