IPL 2024 SRH VS RR : ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో ఆరెంజ్ ఆర్మీకి విజయం వరించింది. పాట్ కమిన్స్ నేతృత్వంలో అన్ని విభాగాల్లోనూ రాణించి పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో మంచి ఆటతీరు కనబరిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆరెంజ్ ఆర్మీని తొలిసారిగా ఫైనల్స్ వరకూ తీసుకెళ్లిన ఘనత పాట్ కమిన్స్ కెప్టెన్సీదే.
IPL 2024 SRH Final Patcummins : మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ విజయంలో జట్టులోని అందరినీ భాగస్వామ్యం చేశాడు. "మా కోచ్ డేనియల్ వెటోరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ను తీసుకోమని చెప్పడమే ఈ విజయానికి కారణమైంది. అందుకే షెహబాజ్ అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాం. అభిషేక్ శర్మ ఆశ్చర్యకరమైన ప్రదర్శన కనబరిచాడు. వీరిద్దరూ మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఈ మైదానంలో 170 పరుగులను చేధించడం కష్టమే. కొన్ని వికెట్లు తీస్తే మ్యాచ్ పై పట్టు సాధించగలమని అనుకున్నాం. అదే అమలు చేయగలిగాం. యువ ఆటగాళ్లు సీజన్ ఆరంభం నుంచి ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా ఆడారు. బ్యాటింగే బలంగా భావించి లక్ష్యాన్ని చేరుకోగలిగాం. టైటిల్ గెలవడం భువీ, నట్టూ, ఉనద్కత్‌లకు డ్రీమ్. అదొక్కటే మిగిలి ఉంది" అని కెప్టెన్ కమిన్స్ అన్నాడు.
కెప్టెన్ కమిన్స్ అరుదైన ఘనత(Patcummins wickets Record) - సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. శుక్రవారం మ్యాచ్‌లో ఓ వికెట్ పడగొట్టి 17 వికెట్లు తీసిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో కమిన్స్ కంటే ముందుగా షేన్ వార్న్ ఉన్నాడు. 2008లో రాజస్థాన్‌కు కెప్టెన్సీ వహించిన వార్న్ 19 వికెట్లు పడగొట్టాడు. అలా షేన్ వార్న్ (రాజస్థాన్)19, కమిన్స్ (హైదరాబాద్) 17, అనిల్ కుంబ్లే (బెంగళూరు)17, రవిచంద్రన్ అశ్విన్ (పంజాబ్) 15 వికెట్లతో జాబితాలో నిలిచారు.
చాహల్ చెత్త రికార్డు - రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్సులు ఇచ్చి మొత్తం 224 సిక్సులను పూర్తి చేసుకున్నాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా 222 సిక్సుల రికార్డును దాటేశాడు చాహల్.
మరిన్ని విశేషాలు
- ఐపీఎల్ ఫైనల్‌కు అత్యధికసార్లు చేరిన ఐదో జట్టుగా నిలించింది సన్‌రైజర్స్. ఇది సన్‌రైజర్స్‌కు మూడోసారి ఫైనల్ చేరడం. ఈ జాబితాలో సీఎస్కే (10) అందరికన్నా ముందుంది.
- చెపాక్ వేదికగా జరిగిన 8 ప్లేఆఫ్స్ మ్యాచుల్లో మొదట బ్యాటింగ్‌కు దిగిన జట్టే ఆరుసార్లు విజయం సాధించింది.
- ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఎక్కువ ఓటములను అందుకున్న ఆరో జట్టుగా నిలిచింది రాజస్థాన్. మొత్తం 11 మ్యాచుల్లో 6 సార్లు ఓటమిని చూసింది.
- ఐపీఎల్ 2024లో ఒక ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి. 9 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చి 5 వికెట్లు దక్కించుకున్నారు.
- షాబాజ్ (3/23) ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు 2016లో భువనేశ్వర్ కుమార్ 3/19 చేశాడు.
రాజస్థాన్‌పై ఘన విజయం - ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ - IPL 2024 Qualifier 2