IPL 2024 RCB : ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీకి అందని ద్రాక్షలా మిగిలిపోయింది. విరాట్ కోహ్లీ చేతుల్లో ఈ ట్రోఫీని ఇప్పటి వరకు చూడకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తూనే ఉంది. బెంగళూరు జట్టు ఇప్పటివరకు మూడుసార్లు (2009, 2011, 2016) ఫైనల్ చేరింది. కానీ ఫలితం దక్కలేదు. ఇక 2016 తర్వాత ఫైనల్‌కు ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయింది. ఇక గత సీజన్లో లీగ్ దశలోనే నిష్క్రమించింది. విరాట్ కెప్టెన్‌గా తప్పుకున్నాక కూడా డుప్లెసిస్ కూడా ఆర్సీబీ రాతను మార్చలేకపోయాడు. అయితే ఈ సారి మరింత బలంగా తయారై టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా జట్టు బలాబలాలపై ఓ లుక్కేద్దాం.
బలాల విషయానికొస్తే బ్యాటింగ్, ఆల్‌రౌండ్ విభాగంలో బలంగా ఉంది. విరాట్, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఉన్న బ్యాటింగ్ ఆర్డర్‌కు ప్రత్యర్థి జట్టు కాస్త తడబడాల్సిందే. మ్యాక్స్‌వెల్ తన స్పిన్ బౌలింగ్‌తోనూ అండగా ఉంటాడు. ప్రస్తుతం భీకర ఫామ్‌తో ఉన్నాడు. కోహ్లీ, డుప్లెసిస్, కూడా ఫామ్‌లోనే ఉన్నారు. కామెరూన్ గ్రీన్, విల్ జాక్స్ లాంటి ఆల్‌రౌండర్లు జట్టుకు మరింత బలం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల ప్లేయర్స్ ఇంకా చాలా మందే ఉన్నారు.
బలహీనతల విషయానికొస్తే పైకి బలంగానే ఉన్నా మైదానంలోకి దిగినప్పుడు కొన్నిసార్లు తేలిపోతుంది. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో తడబడే బలహీనత ఉంది. బ్యాటింగ్ బలంగానే ఉన్నా బౌలింగ్‌లో బలహీనతలు ఉన్నాయి. చాహల్ దూరమయ్యాక స్పిన్ కాస్త బలహీనపడింది. కర్ణ్‌శర్మ, విల్ జాక్స్ మ్యాక్స్‌వెల్ స్పిన్ విభాగంలో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. పేస్ విభాగం పర్వాలేదు. సిరాజ్, టాప్లీ, అల్జారి, ఫెర్గూసన్‌పై ఆ జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
దేశీయ ఆటగాళ్లు : కోహ్లీ, సుయాశ్ ప్రభుదేశాయ్, దినేశ్ కార్తీక్, రజత్ పటీదార్, అనూజ్ రావత్, యశ్ దయాళ్, సిరాజ్, సౌరభ్ చౌహాన్, ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మ, లొమ్రార్, మయాంక్ దాగర్, స్వప్నిల్ సింగ్, హిమాంశు శర్మ, మనోజ్ భండగె, రాజన్ కుమార్, వైశాఖ్.
విదేశీయులు : డుప్లెసిస్ (కెప్టెన్), గ్రీన్, విల్ జాక్స్, మ్యాక్స్‌వెల్, టాప్లీ, టామ్ కరన్, అల్జారి జోసెఫ్; ఫెర్గూసన్.