IPL 2024 RCB Play offs : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ విషయంలో అభిమానులెవరూ ఊహించనిది జరిగింది. ఎప్పుడో ఈ జట్టు కథ ముగిసినట్టుగా కనిపించినా ఇప్పుడు అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. వరుసగా ఐదో విజయంతో అందుకుని ఫ్యాన్స్ ఆశలను సజీవం చేసింది.
తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో రజత్ పటీదార్ మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్ల శ్రమ ఉండడంతో ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించింది. 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్స్ టేబుల్లో ఐదొవ పొజిషన్‌కు దూసుకెళ్లింది. ఇక ఇదే మ్యాచ్‌తో ఏడో ఓటమిని ఖాతాలో వేసుకున్న దిల్లీ జట్టు తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కానీ అసాధారణ రీతిలో ఆర్సీబీ పుంజుకున్నప్పటికీ ముందంజ వేయడం ఆ జట్టుకు అంత తేలికేమీ కాదనే చెప్పాలి. ఎందుకంటే చాలా సమీకరణాలే కలిసి రావాలి. కానీ ప్రస్తుతానికి దిల్లీ క్యాపిటల్స్ కన్నా మెరుగ్గానే ఉంది. 12 పాయింట్లతో సమంగా ఉన్న ఈ రెండు జట్లు చెరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాకపోతే ఇప్పటికీ ఆర్సీబీ మంచి రన్‌రేట్‌తో ఉంది.
ఇకపోతే ఆర్సీబీ తన చివరి లీగ్ దశ మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ పోరులో మంచి రన్‌రేట్‌తో గెలిస్తే ఆ జట్టు 14 పాయింట్లతో కాస్త ముందంజ వేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు తనకు మిగిలిన రెండు మ్యాచుల్లో కనీసం ఒక్క దాంట్లో అయినా ఓటమిని మూట గట్టుకోవాలి. అప్పుడు ఆర్సీబీకి ఇంకాస్త కలిసొస్తుంది.
IPL 2024 Points Table : కాగా, పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడు నాలుగు స్థానాల్లో చెరో 14 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ వరుసగా నిలిచాయి.
అక్షర్ పోరాటం వృథా - ఆర్సీబీ ఖాతాలో మరో సూపర్ విక్టరీ - IPL 2024