IPL 2024 Junior Captains : క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు తమ ప్రత్యర్థలను చిత్తు చేసేందుకు సన్నాహకాలు మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో మార్చి 22న శుక్రవారం రాత్రి 8 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీకొట్టబోతున్నాయి. అయితే ఎప్పటిలాగే ఇందులో తల ధోనీ టాస్ వేసే మూమెంట్‌ను చూద్దామనుకుంటున్న యెల్లో ఫ్యాన్స్‌కు ఈ సారి నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టును కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నడిపించనున్నాడు.
అయితే చెన్నైజట్టులాగే ఈ సీజన్‌లో చాలా ఫ్రాంచైజీలు కొత్త కెప్టెన్‌లను ఎంచుకున్నాయి. అందులో భాగంగా టీమ్ఇండియా యంగ్ స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ కూడా తమ జట్లకు సారథ్యం వహించనున్నారు. టీమ్ ఇండియా భవిష్యత్తుగా పేర్కొంటున్న ఈ యంగ్ ప్లేయర్స్ ఐపీఎల్‌లో తమ జట్లను ఎలా నడిపిస్తారు? ఎలా పర్ఫార్మ్ చేస్తారు? అనే చర్చలు మొదలయ్యాయి. వారి గురించే ఈ కథనం
శుభ్‌మన్ గిల్
టీమ్ఇండియాలో కొంత కాలంగా కీలక ఆటగాడిగా ఎదిగిన గిల్, మొదటిసారి ఐపీఎల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. అదే సమయంలో సీనియర్ బౌలర్ మహ్మద్ షమి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఫ్రాంచైజీ గిల్‌కు గుజరాత్ పగ్గాలను అందజేసింది. ఇక గిల్ సొగసైన బ్యాటింగ్, షార్ప్ క్రికెట్ మైండ్ గుజరాత్ విజయాలకు కీలకం కానుంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరిన గుజరాత్, గిల్ ఫామ్ అందుకుంటే కప్ గెలవడంలో ముందుంటుందని విశ్లేషకుల మాట.
శ్రేయస్ అయ్యర్
మైదానంలో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందిస్తుంటాడు శ్రేయస్ అయ్యర్. గతంలోనూ అయ్యర్‌కి దిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. తన మాస్టర్‌మైండ్‌తో కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. దిల్లీ జట్టును ఫైనల్స్‌కి కూడా చేర్చాడు. ఇక ఈ సీజన్‌లో అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కి నాయకత్వం వహించనున్నాడు. గతంలోనూ కేకేఆర్‌కి సారథ్యం వహించిన అయ్యర్ ఈ సారి కూడా కెప్టెన్ రోల్‌కి అనుభవం, స్థిరత్వాన్ని తెస్తాడు. ఒత్తిడిలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అతని సామర్థ్యం కేకేఆర్ జర్నీలో కీలకంగా మారనుంది. గతేడాది నితీశ్ రాణా కెప్టెన్సీలో ఆడినప్పటికీ ఈ సారి కేకేఆర్ పగ్గాలు అయ్యర్ అందుకోవడం వల్ల అభిమానుల్లో ఆశలు రెట్టింపైంది.
రిషబ్ పంత్
దూకుడు ఇన్నింగ్స్ ఆడటంలోనైనా కానీ, ఇన్నోవేటివ్ లీడర్‌షిప్‌కి మారుపేరైన రిషబ్ పంత్ ఈ సారి దిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలను అందుకున్నాడు. ఆ జట్టులో స్ట్రాంగ్ ప్లేయర్‌గా రాణించిన ఈ స్టార్ క్రికెటర్ తన దూకుడు విధానం, వ్యూహాలతో దిల్లీ క్యాపిటల్స్ సక్సెస్‌లో కీలకం కానున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ నెగ్గలేదు. ఈ సారి పంత్ నాయకత్వంలో ఎలాంటి పెర్ఫామెన్స్ చేస్తుందనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ ఐపీఎల్ సీజన్‌కి పంత్ అందుబాటులోకి రావడం దిల్లీ క్యాపిటల్స్‌కి శుభపరిణామం.
ఈ ముగ్గురు డైనమిక్ కెప్టెన్‌లు తమదైన రోజున ఒంటి చేత్తో తమ టీమ్‌లకు విజయాలు అందించగలరు. ఈ ఐపీఎల్ సీజన్‌లో రసవత్తర పోరులకు కొదవుండదని అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చెన్నై సిక్సర్ కొట్టేనా? - జట్టు బలాబలాలు ఇవే! - IPL 2024 CSK
ఐపీఎల్ ఫైనల్ ఓడిన కెప్టెన్లు గుర్తున్నారా?- లిస్ట్‌లో సచిన్, విరాట్ ఇంకా ఎవరంటే?