IPL 2024 DC VS KKR : ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన 16వ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 273 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు కోల్‌కతా ఆటగాళ్లు. లక్ష్యాన్ని చేధించలేకపోయిన దిల్లీ 106 పరుగుల తేడాతో ఓటమికి గురైంది. సునీల్ నరైన్, రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌లు మ్యాచ్‌కు హైలెట్ అని చెప్పాలి. ఈ ప్రదర్శన గురించి వారి మాటల్లోనే..
శ్రేయస్ అయ్యర్ - "అస్సలు ఊహించలేదు. మేం 210-220 మధ్యలో స్కోరు చేయగలమనుకున్నాం. కానీ, 270కి మించి చేయగలిగాం. సునీల్ నరైన్ శుభారంభం పలికితే బాగుంటుందని మ్యాచ్ ముందే చెప్పా. ఇక, రఘువంశీ తొలి బంతిని ఎదుర్కోవడం నుంచే భయం లేకుండా ఆడాడు. అతని ఆటతీరు చూడటానికి చాలా చక్కగా అనిపించింది. బౌలర్లు కూడా సరైన సమయంలో కరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు. వైభవ్ అరోరా కీలకమైన వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రానాకు గాయమైన సంగతి నాకు తెలియదు." అని అన్నాడు.
సునీల్ నరైన్ - "జట్టు కోసం ఎలా ఆడాలో దానికి సిద్ధంగా ఉన్నా. అబుదాబి నైట్ రైడర్స్ జట్టులో ఆడినప్పుడు బ్యాటర్స్ సరిపడా ఉన్నారు. అప్పుడు ఓపెనర్‌గా ఆడాల్సిన అవసరం లేదు, లోయరార్డర్‌లో ఆడాను. నేను బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ ను కూడా ఇష్టపడతా. సాల్ట్‌తో కలిసి ఆడటం చాలా బాగుంది. అతనితో ఆడుతుంటే అసలు ఒత్తిడి తెలియదు. జట్టుగా అందరం బాగా ఆడాం." అని చెప్పాడు.
రిషబ్ పంత్ - "బౌలింగ్‌లో కాస్త వెనుకబడినట్లు అనిపించింది. బ్యాటింగ్ విభాగంలో ప్రతి ఒక్కరూ ఇంకా బాగా ఆడితే సాధించేవాళ్లం. మైదానం పెద్దగా ఉండటంతో టైమర్ సరిగా కనిపించలేదు. సాంకేతిక లోపాలు కాస్త ఇబ్బందిపెట్టాయి. మన చేతిలో లేని విషయాల గురించి చింతించాల్సిన పనిలేదు. క్రికెట్‌లో ఒడిదొడుకులు సహజం. ఒక టీంగా మన సత్తా ఏంటో నిరూపించుకోవాలంతే. వ్యక్తిగతంగా రోజురోజుకీ మెరగవుతున్నా. నా బెస్ట్ ఇవ్వడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా"అని వెల్లడించాడు.
6 బంతుల్లో 6 బౌండరీలు - పంత్ మెరుపు షాట్లకు షారుక్ ఫిదా! - IPL 2024 KKR VS Delhi Capitals
గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టిన సునీల్ - 7 ఫోర్లు 7 సిక్స్‌లతో విశాఖలో వీరబాదుడు - IPL 2024 DC VS KKR