IPL 2024 CSK VS DC Pant Fined : ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి దిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. ఈ విజయంలో హాఫ్ సెంచరీతో (51) మెరిశాడు దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్. దాదాపు ఏడాదిన్నర తర్వాత మైదానంలోకి అడుగు పెట్టిన అతడు రెండు మ్యాచులు ఆడిన తర్వాత ఇప్పుడు తన మూడో మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఒంటి చేత్తోనే సిక్స్ కొట్టి పాత పంత్‌ను గుర్తు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత దీని గురించి మాట్లాడాడు. మ్యాచ్‌లో తమ బౌలర్లు అద్భుతం చేశారని పేర్కొన్నాడు. పృథ్వీ షా, ముకేశ్ కుమార్ మంచిగా రాణించారని చెప్పాడు.
"చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. గత మ్యాచుల్లో చేసిన తప్పిదాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుని బరిలోకి దిగాము. పృథ్వీ షా బాగా కష్టపడ్డాడు. అందుకే అతడికి ఛాన్స్ ఇచ్చాము. ముకేశ్ కుమార్ కీలక సమయాల్లో వికెట్లు తీసి అదరగొట్టాడు. పరిస్థితులు ఆధారంగా అతడితో బౌలింగ్ చేయించాలని భావించాం. అలానే డెత్ ఓవర్లలో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మేము పుంజుకున్న తీరు మంచిగా ఉంది. నేను కూడా ప్రారంభంలో కాస్త టైమ్ తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత క్రికెట్ ఆడుతున్నాను కదా. కచ్చితంగా మంచి ఇన్నింగ్స్ ఆడతానని భావించాను. ఒంటి చేత్తో సిక్స్ కొట్టడంపై మాట్లాడటానికి ఏమీ లేదు. ఈ ఆట కోసమే దాదాపు ఏడాదిన్నర పాటు వెయిట్ చేశాను. ఇప్పటికీ క్రికెటర్‌గా పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాను అని పంత్ పేర్కొన్నాడు.
పంత్‌కు జరిమానా ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు ఓ చేదు అనుభవం కూడా ఎదురైంది. అతడికి రూ.12 లక్షలు జరిమానా విధించారు నిర్వాహకులు. స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్‌కు జరిమానా విధించినట్లు తెలిపారు. కాగా, ఈ మ్యాచ్‌లో పంత్ ప్రదర్శనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అతడు హాఫ్ సెంచరీ బాదాడు. 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 51 పరుగులు చేశాడు.
పంత్ ఈజ్ బ్యాక్ - 159 స్ట్రైక్‌రేట్‌తో చెన్నైపై వీరబాదుడే - IPL 2024 CSK VS Delhi Capitals
ధోనీ దంచుడే దంచుడు - 8వ స్ధానంలో వచ్చి సిక్సర్ల వర్షం! - IPL 2024 DC VS CSK