Cricketers Who Never Got Out in ODI Format : అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ ఇండియా ప్లేయర్లు చాలా రికార్డులు నెలకొల్పారు. ముఖ్యంగా వన్డేల్లో సచిన్ తెందూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేరిట చాలా రికార్డులు ఉన్నాయి. ఇతర ప్లేయర్‌లకు ఈ రికార్డులను అందుకోవడం అంత తేలిక కాదు. ఈ స్థాయిలో రాణించిన సచిన్, రోహిత్, కోహ్లి చాలాసార్లు వన్డేల్లో అవుట్ అయ్యారు. అయితే వన్డేల్లో ఒక్కసారి కూడా అవుట్ కానీ భారత ఆటగాళ్లు ఉన్నారని మీకు తెలుసా?
భరత్ రెడ్డి (Bharat Reddy)
భారత మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి 1978 నుంచి 1981 వరకు భారతదేశం తరఫున కేవలం మూడు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతడు ఓ ప్రత్యేకమైన రికార్డు నెలకొల్పాడు. భారత క్రికెట్ జట్టు తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన భరత్ రెడ్డి కేవలం రెండు సార్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడు. రెండు మ్యాచుల్లోనూ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ తరఫున వన్డే క్రికెట్‌లో ఎప్పుడూ ఔట్‌కాని క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.
సౌరభ్ తివారీ (Saurabh Tiwari)
భారత క్రికెట్ జట్టులో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్‌గా అడుగుపెట్టిన సౌరభ్ తివారీని చాలా మంది ధోని డూప్లికేట్ అని పిలుస్తారు. అతని ముఖం, పొడవాటి జుట్టు ధోనిని గుర్తు చేస్తాయి. సౌరభ్ తివారీ 2010లో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగు పెట్టాడు. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాపై ఆడాడు. ఈ సమయంలో అతడు భారత్ తరఫున 3 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 49 పరుగులు చేశాడు. ఈ మూడు మ్యాచుల్లో సౌరభ్ తివారీ నాటౌట్‌గా నిలిచాడు. వన్డే క్రికెట్‌లో ఎప్పుడూ ఔట్ కాని బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో చోటు సంపాదించాడు.
ఫయాజ్ ఫజల్ (Faiz Fazal)
టీమ్ఇండియాలో అరంగేట్రం చేసిన ఫయాజ్ ఫజల్ కూడా వన్డే క్రికెట్‌లో ఔట్ కాని బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన ఫజల్‌కి, 2016 జూన్ 15న భారత క్రికెట్ జట్టులో చోటు దక్కింది. ఫయాజ్ ఫజల్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. మొదటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగినా అనంతరం ఫయాజ్‌కి టీమ్ ఇండియా జట్టులో అవకాశం దక్కలేదు. అనంతరం ఒక్క వన్డేతోనే అతని కెరీర్ ముగిసిపోయింది.