IND vs NZ 3rd Test 2024 : భారత్- న్యూజిలాండ్ మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం భారత్ స్కోర్ 86- 4. క్రీజులో రిషభ్ పంత్ (1 పరుగు), శుభ్‌మన్ గిల్ (31 పరుగులు) ఉన్నారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 2, మ్యాట్ హెన్రీ 1 వికెట్ దక్కించుకున్నారు.
కోలుకున్నట్లే కనిపించినా!
భారత్‌కు మరోసారి పేలవ ఆరంభం దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మ్యాట్ హెన్రీ రోహిత్‌ను ఔట్ చేశాడు. తర్వాత వన్‌డౌన్‌లో వచ్చి గిల్‌తో, జైస్వాల్ కాసేపు స్కోర్ బోర్డను నడిపించాడు. దీంతో టీమ్ఇండియా 71-1తో కాస్త కోలుకున్నట్లుగానే కనిపించింది. 78 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. జైస్వాల్ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
తర్వాత బంతికే మహ్మద్ సిరాజ్ (0) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (4 పరుగులు) కూడా మరోసారి నిరాశ పర్చాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ 84- 4కు చేరింది. 17.1 ఓవర్ల వద్ద 78-1తో ఉన్న భారత్ స్కోర్ బోర్డు, 18.3 ఓవర్లకు 84- 4 అయ్యింది. అంటే 9 బంతుల వ్యవధిలో టీమ్ఇండియా 3 వికెట్లు చేజార్చుకుంది.
Stumps on the opening day of the Third Test in Mumbai.#TeamIndia move to 86/4 in the 1st innings, trail by 149 runs.
— BCCI (@BCCI) November 1, 2024
See you tomorrow for Day 2 action
Scorecard - https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/ppQj8ZBGzz
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. స్పిన్‌కు అనుకూలించిన ముంబయి వాంఖడే పిచ్‌పై మనోళ్లు చెలరేగిపోయారు. స్టార్ బ్యాటర్ విల్ యంగ్ (71 పరుగులు), డారిల్ మిచెల్ ( 82 పరుగులు) ఇద్దరే హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ టామ్ లేథమ్ (28 పరుగులు), డేవన్ కాన్వే (4 పరుగులు), రచిన్ రవీంద్ర (5 పరుగులు), టామ్ బ్లండెల్ (0), గ్లెన్ ఫిలిప్స్ (17 పరుగులు) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. రవీంద్ర జడేజా 5, వాషింగ్టన్ సుందర్ 4, ఆకాశ్ దీప్ 1 వికెట్లు దక్కించుకున్నారు.