India Vs England Test Series : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ తమ తొలి టెస్ట్ ఆడనుంది. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచుల కోసం ఇప్పటికే రెండు టీమ్స్ స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే పలు కారణాల వల్ల మొదటి రెండు టెస్టులకు టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఈ మ్యాచ్‌లకు ఎవరు ఆడనున్నారన్న విషయంపై చర్చలు మొదలయ్యాయి. కొంత మంది పేర్లు వినిపించినప్పటికీ ఇంకా ఈ విషయంపై క్లారిటీ కాలేదు. అయితే తాజాగా ఓ ప్లేయర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. విరాట్ స్థానంలో ఓ ఆర్‌సీబీ ఆటగాడు రానున్నట్లు తెలుస్తోంది. అయితే అతడెవరో కాదు యంగ్ ప్లేయర్ రజత్ పటీదార్.
ప్రస్తుతం ఈ స్టార్ క్రికెటర్ పేరును బీసీసీఐ పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దాదాపు ఇతడినే విరాట్‌కు రీప్లేస్‌మెంట్‌గా తీసుకోనున్నారట. ఈ నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ నిర్వహించిన అవార్డుల ఫంక్షన్‌కు కూడా పటీదార్ హాజరయ్యాడు. దీంతో అతడినే ఎంపిక చేస్తారని రహానె, పుజారాను తీసుకోవడానికి సెలక్షన్ కమిటీ ఆసక్తిగా లేనట్లు పలువురి మాట. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
మరోవైపు రజత్ పటీదార్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అహ్మదాబాద్‌లో గత వారం ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్- ఎ తరఫున తొలి అనధికార టెస్టులో 151 పరుగులు స్కోర్ చేశాడు. అంతకుముందు వార్మప్ మ్యాచ్‌లోనూ 111 పరుగులు సాధించాడు. 30 ఏళ్ల రజత్ ఇప్పటివరకు 55 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 45.97 సగటుతో 4,000 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2021-22లో మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ గెలుపులో రజత్ కీలక పాత్ర పోషించాడు. అయితే కోహ్లీ ప్లేస్ దక్కించుకునేందుకు టీమ్ఇండియాకు చెందిన ముగ్గురు ప్లేయర్లు పోటీపడ్డారు. అందులో రజత్తో పాటు టెస్టు స్టార్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా యువ ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు.