India Vs England Test Series Alastair Cook : భారత్-ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ సమరం జనవరి 25(గురువారం) నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తమ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఆ జట్టు మాజీ సారథి అలిస్టర్ కుక్. బరిలోకి దిగేముందు కనీసం ఒక్క వార్మప్ మ్యాచ్ కూడా ఆడకపోవడం మా కొంప ముంచుతుందేమో అని తమ విజయావకాశాలపై ఆందోళన వ్యక్తం చేశాడు. జట్టుకు సరైన సన్నద్ధత లేదని, ఇదే సిరీస్‌లో వెనకబడటానికి కారణం అవుతుందేమోనని ఆందోళనగా ఉందని కుక్ వ్యాఖ్యానించాడు. ఉపఖండ పిచ్‌లకు భారత పిచ్‌లు సరిపోలేలా ఉంటాయని, దీనికోసమే ఇంగ్లాండ్ జట్టు అబుదాబీని ట్రైనింగ్ క్యాంప్‌ను ఎంచుకుందేమోననే అంశంపైనా స్పందించాడు.
"అబుదాబీలో మా టీమ్ ప్రాక్టీస్ చేసింది. అక్కడి పిచ్‌లకు, భారత్ పిచ్‌లకు సారూప్యం ఉంటుందని అంటున్నారు. అయితే అది ఏ మేర గెలుపును అందిస్తుందో చూడాలి. మ్యాచ్‌కు సన్నద్ధత కాకపోవడం మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుందేమోనని అనిపిస్తోంది. 2012లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు మేం మూడు వార్మప్ మ్యాచ్‌లు ఆడాం. యువరాజ్, అజింక్య రహానె, మురళీ విజయ్‌తో కూడిన ఇండియా టీమ్‌తో తలపడ్డాం. ఛెతేశ్వర్ పుజారా కూడా ఒక మ్యాచ్‌లో ఆడాడు. ఇప్పుడు మాత్రం నేరుగా టెస్టు మ్యాచ్‌లోనే ఆడేందుకు మా జట్టు రెడీ అయింది. షెడ్యూల్‌లో కనీసం ఒక్క వార్మప్ మ్యాచ్ ఉంటే బాగుండేది. కానీ, ఇంగ్లాండ్ టీమ్ అలా ఎందుకు అబుదాబీలో ప్రాక్టీస్ చేయాలని అనుకుందో నేను అర్థం చేసుకోగలను. అక్కడి పిచ్‌లు, నెట్స్, సౌకర్యాలపై వారికి పూర్తి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను."
- ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్
'అతడిని చూసి బ్యాటింగ్ నేర్చుకోవాలి'
'భారత్‌లోనూ ఇంగ్లాండ్ జట్టు బజ్‌బాల్ క్రికెట్ ఆడుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. విక్టరీ సాధించడానికి ఇదో గోల్డెన్ ఛాన్స్. బ్యాటింగ్‌కు సంబంధించి ఉపఖండంలో సంప్రదాయంగా వస్తున్న నిబంధనలను మా జట్టు ఫాలో అవ్వదు. తొలి 30 బంతులను హ్యాండిల్ చేయగలిగితే ఈజీగా రన్స్‌ను రాబట్టవచ్చు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్పిన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. మమ్మల్ని తడబాటుకు గురిచేసేందుకు మా చుట్టూ ఫీల్డర్లు రెడీగా ఉంటారు. ప్రత్యర్థి ఆటగాళ్లు మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఈ అంశాలన్నింటినీ తట్టుకుని పరుగులు చేయాలంటే ఇప్పుడు మా జట్టు పాటిస్తున్న బజ్‌బాల్ స్ట్రాటజీనే కరెక్ట్. ఇందులో భారత బౌలర్లు ఒత్తిడికి గురవుతారని అనుకుంటున్నా. ఇక స్పిన్‌లో జో రూట్ దిట్ట. ఇందుకు ఉదాహరణ అతడి గత గణాంకాలను చూస్తే తెలిసిపోతుంది. టర్నింగ్ పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలనేది అతడిని చూసి మిగతా మా బ్యాటర్లు నేర్చుకోవాలి' అని కుక్ పేర్కొన్నాడు.
ఇక దాదాపు నెల రోజుల పాటు జరగనున్న ఈ సిరీస్‌లో తలపడేందుకు ఇరుజట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లిష్ జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది. గురువారం తొలి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ - తొలి రెండు మ్యాచ్‌లకు కోహ్లీ దూరం
భారత్xఇంగ్లాండ్ టెస్టు- 100 వికెట్లకు చేరువలో అశ్విన్- టాప్5 వీళ్లే